BJP: హిమాచల్ పరిస్థితి రాదని చెప్పలేం... పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండి: లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్

  • తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వ్యాఖ్య
  • రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారవుతుందని హెచ్చరిక
  • తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు కేవలం 64 మాత్రమేనని గుర్తు చేసిన బీజేపీ ఎంపీ
  • ఢిల్లీలో ఉండే కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపణ
  • పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు బడ్జెట్ సరిపోదన్న లక్ష్మణ్
BJP leader Laxman shocking comments on telangana government

బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండి... చూద్దాం తెలంగాణ... కర్ణాటక అవుతుందో... హిమాచల్ అవుతుందో.. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరగబడ్డారని తెలిపారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌లో కాంగ్రెస్‌‌పై అసహనంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేసినట్లు చెప్పారు.

హిమాచల్ పరిస్థితి తెలంగాణలో రాలేదని చెప్పలేమన్నారు. రాబోవు రోజుల్లో రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు కేవలం 64 మాత్రమేనని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండి అన్నారు. ఢిల్లీలో ఉండే కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు మోసపూరిత వాగ్దానాలేనని మండిపడ్డారు. సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం... ఉన్నపళంగా మంత్రులుగా కావడంతో ఆ పార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

తెలంగాణలోని పదిహేడు లోక్ సభ స్థానాలలోనూ తాము ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నామన్నారు. ఇక పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు బడ్జెట్ సరిపోదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు ఉచితమని చెప్పి ఇప్పుడేమో అర్హులు అని చెబుతున్నారన్నారు. బీజేపీ లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని... ఓడిపోవడంతో తమపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News