Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్‌కు సీబీఐ సమన్లు... రేపు మాజీ సీఎంను ప్రశ్నించనున్న అధికారులు

  • 2012-2016 మధ్య హమీర్‌పూర్‌లో జరిగిన అక్రమ మైనింగ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి నోటీసులు 
  • సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సాక్షిగా విచారణకు పిలిచిన సీబీఐ
  • బీజేపీపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం
Akhilesh Yadav summoned by CBI as witness tomorrow in UP illegal mining case

అక్రమ మైనింగ్ కేసులో రేపు విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. అయితే ఆయనను సాక్షిగా మాత్రమే సీబీఐ విచారణకు పిలిచింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ ఈ నోటీసులను జారీ చేసిందని, అఖిలేశ్ యాదవ్‌ను గురువారం ఢిల్లీలో ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమైందని నివేదికలు పేర్కొన్నాయి. 2012-2016 మధ్య హమీర్‌పూర్‌లో జరిగిన అక్రమ మైనింగ్‌పై అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జరిపి, నమోదు చేసిన ‌ఎఫ్ఐఆర్‌కు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి.

ఇండియా టుడే నివేదిక ప్రకారం, నేరపూరిత కుట్ర, దొంగతనం, దోపిడీ, మోసం, నేరం వంటి నేరాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2012-2016 మధ్య కాలంలో హమీర్‌పూర్‌లో అక్రమ మైనింగ్‌కు అనుమతించిన పలువురు అధికారులతో పాటు 11 మందిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది టెండర్ విధానాన్ని అనుసరించకుండా... చట్టవిరుద్ధంగా లీజులు మంజూరు చేశారని, అప్పటికే ఉన్న లీజులను పునరుద్ధరించారని విచారణలో గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి అఖిలేశ్ యాదవ్‌ను సాక్షిగా సీబీఐ విచారణకు పిలిచింది.

బీజేపీపై అఖిలేశ్ విమర్శలు

ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటు వేసిన రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు గాను బీజేపీ 8, ఎస్పీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో బీజేపీ ఎనిమిదో రాజ్యసభ సీటును కూడా గెలుచుకుంది.

More Telugu News