Shreyas iyer: రంజీ ట్రోఫీ సెమీఫైనల్ లో ముంబై జట్టుకు శ్రేయస్ ఎంపిక

Shreyas iyer is in Ranji Trophy Semi final Match From Mumbai Team
  • బీసీసీఐ హెచ్చరికతో దారికొస్తున్న ఆటగాళ్లు
  • దేశవాళీ క్రికెట్ లో ఆడుతున్న టీమిండియా ప్లేయర్లు
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన వారికి బీసీసీఐ నగదు ప్రోత్సాహం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పై ఆసక్తితో దేశవాళీ మ్యాచ్ ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బీసీసీఐ భావిస్తోంది. జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలని గతంలోనే సూచించింది. అయినప్పటికీ పలువురు సీనియర్ ఆటగాళ్లు వివిధ కారణాలు చూపిస్తూ మ్యాచ్ లు ఆడట్లేదు. ఈ సూచనను శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌లు విస్మరించారు. వారిద్దరిని కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితా నుంచి బోర్డు తప్పించనుందని వార్తలొచ్చాయి. దీంతోపాటు కచ్చితంగా దేశవాళీ మ్యాచ్ లు ఆడేలా నిబంధన తీసుకురావడంతో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడినవారికి నగదు ప్రోత్సాహకం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ హెచ్చరికతో ఆటగాళ్లు దారికి వస్తున్నారు. వెన్ను గాయం కారణంగా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు దూరమైన శ్రేయస్ అయ్యర్ తాజాగా సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు. శ్రేయస్ ను ముంబై జట్టుకు ఎంపిక చేశారు.

వెన్ను గాయం, ఫామ్‌తో తంటాలు పడుతున్న శ్రేయస్‌ను ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టులకు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ నుంచి ఇదే కారణంతో తప్పుకున్నాడు. అయితే శ్రేయస్ ఫిట్‌గా ఉన్నాడని జాతీయ క్రికెట్‌ అకాడమీ డాక్టర్ నితిన్‌ పటేల్‌ లేఖ రాయడం దుమారం రేపింది. కాగా, గతేడాది దక్షిణాఫ్రికా టూర్ మధ్యలోనే తిరిగొచ్చిన కిషన్ కూడా దేశవాళీ మ్యాచ్ లో ఆడుతున్నాడు. డీవై పాటిల్‌ టీ20 మ్యాచ్‌లో ఆర్‌బీఐ తరఫున బరిలో దిగిన కిషన్.. 12 బంతుల్లో 19 పరుగులు చేశాడు.
Shreyas iyer
Cricket
Mumbai
Ranji Trophy
BCCI

More Telugu News