Etela Rajender: హామీలు అమలు చేయకుంటే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది: ఈటల రాజేందర్

  • రూ.34 వేల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తారో చెప్పాలని ఈటల రాజేందర్ నిలదీత
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండాలి... కానీ ఆటో డ్రైవర్లకు సాయం అందించాలని డిమాండ్
  • మోదీ ప్రభుత్వం ఇస్తోన్న ఆయుష్మాన్ భారత్‌ను వినియోగించుకోవాలని సూచన
Etala Rajender warns cm revanth reddy over congress promises

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర మంగళవారం మెదక్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి రూ.34 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని... కానీ అది ఎలా సాధ్యమో చెప్పాలని నిలదీశారు. ఈ అంశంపై రేవంత్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండాల్సిందేనని... కానీ ఆటో డ్రైవర్లకు రేవంత్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.12 వేల సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పేదలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.10 లక్షల వైద్య బీమా ఇస్తోందని... దీనిని వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ వచ్చినప్పుడు మద్యం ఆదాయం రూ.10,700 కోట్లుగా ఉండేదని, కానీ ఇప్పుడు రూ.45వేల కోట్లకు చేరుకుందన్నారు. మహిళల బాగు కోసం బెల్ట్ దుకాణాలను మూసివేయాలని సూచించారు.

కేసీఆర్ లక్ష కోట్ల రుణమాఫీ చేయలేకపోయారని, ఇక రేవంత్ లక్షన్నర ఎలా చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గోల్ మాల్ చేస్తారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. మోదీ ప్రభుత్వం వచ్చాక సరిహద్దుల్లో ఆర్మీ ప్రశాంతంగా ఉంటోందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు జరుగుతాయని ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News