Nara Bhuvaneswari: సాలూరులో 'సంజీవని' హెల్త్ క్లినిక్ ప్రారంభించిన నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!

Nara Bhuvaneswari inaugurates NTR Sanjeevani Health Clinic in Salur
  • నిజం గెలవాలి యాత్ర కోసం ఉత్తరాంధ్ర వెళుతూ సాలూరులో ఆగిన భువనేశ్వరి
  • ఎన్టీఆర్ 'సంజీవని' హెల్త్ క్లినిక్ కు రిబ్బన్ కటింగ్
  • గిరిజనులకు వైద్యం అందించడం ఆనందంగా ఉందని వెల్లడి
  • ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని వివరణ
గిరిజన సోదర, సోదరీమణులకు వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు నారా భువనేశ్వరి అన్నారు. ఉత్తరాంధ్రలో 'నిజం గెలవాలి' పర్యటనకు వెళుతూ మార్గమధ్యంలో సాలూరు పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ 'సంజీవని' హెల్త్ క్లినిక్ ను ఆమె ఇవాళ ప్రారంభించారు. అనంతరం క్లినిక్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

క్లినిక్ లో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను పరిశీలించిన నారా భువనేశ్వరి అక్కడి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లినిక్ మొత్తం పరిశీలించి ఏర్పాట్లపై సంతోషం వ్యక్తి చేశారు. సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి వైద్యసేవలను అందించాలని క్లినిక్ సిబ్బందికి సూచించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 

"నా గిరిజన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు ఉన్న ఈ సాలూరు ప్రాంతంలో సంజీవని క్లినిక్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో నేటికీ వైద్యం అందక గిరిజనులు పడుతున్న ఇబ్బందులను మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 27ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉచిత విద్య, వైద్యం తెలుగు ప్రజలకు అందిస్తూ సేవలు అందిస్తున్నాం.   

ఎన్టీఆర్ ట్రస్టు నుండి 3 బ్లడ్ బ్యాంక్ కేంద్రాలు నిర్వహిస్తున్నాం. వీటి నుండి ఇప్పటి వరకు 8 లక్షల మంది ప్రజలకు రక్తాన్ని ఇచ్చి కాపాడాం. సంజీవని క్లినిక్స్ ద్వారా 67,104 కుటుంబాలు లబ్ధి పొందాయి. ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ద్వారా 33,681 కుటుంబాలు వైద్యసేవలు పొందాయి. 

పాకాల, పాలకొండ, పోలవరం, కురుపాం, పాడేరు, రంపచోడవరం, అరకు ప్రాంతాల్లో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఎన్టీఆర్ పేదల పట్ల సంకల్పించిన సేవా కార్యక్రమాలను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా నెరవేరుస్తున్నాం. సాలూరు పట్టణ ప్రజలు ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ ను సద్వినియోగం చేసుకుని, వైద్య సేవలు పొందాలని కోరుతున్నాం.
Nara Bhuvaneswari
Sanjeevani Health Clinic
Salur
NTR
Chandrababu
Nijam Gelavali Yatra
Andhra Pradesh

More Telugu News