KTR: పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి డూడూ బసవన్న కిషన్ రెడ్డి కావాలా?: కేటీఆర్

  • పార్లమెంట్ ఎన్నికల్లో కారు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లడం ఖాయమన్న కేటీఆర్
  • సికింద్రాబాద్ ఎంపీగా ఎవరు కావాలో ప్రజలు నిర్ణయించుకునే సమయం వచ్చిందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ మాటలు నమ్మి కేసీఆర్‌ను దూరం చేసుకున్నామని ప్రజలు బాధపడుతున్నారన్న కేటీఆర్
KTR interacts brs cadre at maharana prathap function hall

పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి డూడూ బసవన్న కిషన్ రెడ్డి కావాలా? హక్కులు, అభివృద్ధి కోసం కొట్లాడే నాయకుడు కావాలా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అంబర్‌పేట మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అధ్యక్షతన మంగళవారం బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల్లో కారు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లడం ఖాయమన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా ఎవరు కావాలో ప్రజలు నిర్ణయించుకునే సమయం వచ్చిందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి బీఆర్ఎస్‌ను అన్ని స్థానాల్లో గెలిపించారని... ఇందుకు వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. 119 సీట్లలో 39 సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ దొంగ మాటలు నమ్మి కేసీఆర్‌ను దూరం చేసుకున్నామని ప్రజలు బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదన్న కేసీఆర్‌ మాటలను ఈ ప్రభుత్వం నిజం చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని 420 హామీలను గుర్తు చేశారు.

కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ తన సికింద్రాబాద్ నియోజకవర్గానికి పైసా ఖర్చు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రపంచం గర్వపడేలా కాళేశ్వరం లిఫ్టులు ప్రారంభిస్తే, కిషన్ రెడ్డి మెట్రో రైల్వే స్టేషన్‌ లిఫ్టులు, సింటెక్స్‌ ట్యాంకులను ప్రారంభిస్తున్నాడని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.

More Telugu News