Bhumireddy Ram Gopal Reddy: కుప్పానికి చంద్రబాబు ఏం చేశారో... పులివెందులకు నువ్వేం చేశావో రెఫరెండానికి సిద్ధమా జగన్?: టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి సవాల్

  • సీఎంగా ఉండి నియోజకవర్గంలో నాలుగు రోడ్లు కూడా పూర్తి చేయలేదన్న భూమిరెడ్డి
  • ఏపీలో రైతుల ఆత్మహత్యల్లో పులివెందులది మొదటి స్థానం అని వెల్లడి
  • కుప్పంను చంద్రబాబు పారిశ్రామికంగా అభివృద్ధి చేశారన్న ఎమ్మెల్సీ
  • జగన్ వల్ల పులివెందులలో ఉన్న పరిశ్రమలూ పారిపోయే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా 
TDP MLC Bhumireddy Ram Gopal Reddy challenges CM Jagan

కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేశారో...పులివెందుల నియోజకవర్గానికి నువ్వు ఒరగబెట్టిందేమిటో తేల్చేందుకు రెఫరెండానికి సిద్ధమా అని సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు మంగళవారం రాంగోపాల్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. 

‘‘కుప్పం సభలో జగన్ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పాడు. ఆయన చెప్పే మాటలు వింటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏమీ చేయలేదని... తానేదో అన్నీ చేసినట్లు జగన్ మాట్లాడుతున్నాడు. 

నువ్వు సీఎంగా గెలిచాక పులివెందులలో అదనంగా ఒక్క ఎకరాకైనా నీళ్లు అందించావా? పులివెందులలో కనీసం నాలుగు రోడ్లైనా వేశావా? 2020లో కేంద్ర నిధులతో ప్రారంభమైన గ్రామ సడక్ యోజన రోడ్లను 10 శాతం కూడా పూర్తి చేయలేదంటే నీ పరిపాలన ఎలా ఉందో తెలుస్తోంది. పులివెందులలో ఎంత మంది లబ్దిదారులకు ఇళ్లు అప్పగించారు? 

సెంటు పట్టా కింద 8 వేల గృహాలు నిర్మించామని చెప్పారు... కనీసం 8 ఇళ్లు అయినా లబ్దిదారులకు అందించారా? నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామాల్లో రహదారుల విస్తరణ పేరుతో ఇబ్బందులు తెచ్చి పెట్టారు. యురేనియం ప్రాజెక్టు బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత వ్యర్థాలు భూమిలో కలిసి రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్రంతో గానీ, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఏనాడైనా మాట్లాడావా జగన్? 

చంద్రబాబు పులివెందులకు డ్రిప్ మైక్రో ఇరిగేషన్ ద్వారా సాగునీటిని అందించారు. నాలుగున్నరేళ్లలో ఏనాడైనా నియోజకవర్గానికి మైక్రో ఇరిగేషన్ ఇచ్చావా? వ్యవసాయం అథోగతి పాలైంది. దేశంలోనే ఏపీ రైతుల ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో పులివెందులలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. 

వెనుకబడిన కుప్పం చంద్రబాబు కృషితో కొత్త నాగరికతలోకి వచ్చింది. కర్ణాటక, తమిళనాడుకు పండ్లు, కూరగాయలు పెద్ద ఎత్తున ఎగుమతులు సాగుతున్నాయంటే చంద్రబాబు చేసిన మంచి పనుల వల్లే. పారిశ్రామిక అభివృద్ధి, ద్రవిడ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, యువతకు ఉపాధి అవకాశాలను కుప్పం ప్రజలకు చంద్రబాబు కల్పించారు. పేదవారు తమ కాళ్లపై నిలబడేలా కుప్పంలో చంద్రబాబు చేశారు. 

పులివెందులలో మీరు ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు... ఉన్న ఒకట్రెండు కూడా ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. స్పిన్నింగ్ మిల్స్ తేవడానికి కూడా కృషి చేయలేదు. పులివెందులలో నాడు-నేడు కింద ఎన్ని పాఠశాలలకు మరమ్మతులు చేశారు? 

2019కి ముందు ఎంత మంది ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఉన్నారో... ఇప్పుడు ఎంతమంది ఉన్నారో బేరీజు వేసుకోవాలి. మైకు, అధికారం వున్నాయని, కోట్లు వెదజల్లి జనాన్ని తీసుకొచ్చి మైకు మందు అబద్ధాలు చెప్పడం సరికాదు" అంటూ భూమిరెడ్డి ధ్వజమెత్తారు.

More Telugu News