: 'శని'లాంటి గ్రహం!

విశ్వంలో శనిగ్రహం లాంటి మరో గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకారంలో మాత్రం కాదులెండి...! ఈ కొత్త గ్రహం భూమికి సుమారు 700 కాంతి సంవత్సరాల దూరంలో ఒక తార చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు. ఇది అచ్చు శనిగ్రహాన్ని పోలి ఉందని వారు చెబుతున్నారు. లూయిస్‌విల్లె విశ్వవిద్యాలయానికి చెందిన క్యారెన్‌ కాలిన్స్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కిలోడిగ్రీ ఎక్స్‌ట్రీమ్లీ లిటిల్‌ టెలిస్కోప్‌ (కెల్ట్‌)ను ఉపయోగించి దీన్ని గుర్తించారు. ఈ కొత్త గ్రహానికి కెల్ట్‌-6బి అని పేరుపెట్టారు.

ఈ కొత్త శనిగ్రహం కోమా బెరెనైసెస్‌ అనే తారామండలంలో ఉంది. తన మాతృతార ముందునుండి వెళుతుండగా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. ఈ గ్రహం తన మాతృతారను ప్రతి 7.8 రోజులకు ఒకసారి చుట్టి వస్తుంది. అంటే ఈ గ్రహానికి ఒక సంవత్సరం అంటే కేవలం వారం రోజులు మాత్రమే. ఇకపోతే దీని మాతృతార వయసు సుమారు మన సూర్యుడి వయసంతే ఉంటుంది. ఈ గ్రహం వేడి వాయువులతో కూడిన భారీ గ్రహంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని పరిమాణం, ద్రవ్యరాశిని పోల్చి చూసినపుడు ఇది మన సౌరకుటుంబంలోని శనిగ్రహాన్ని పోలి ఉంది. అయితే మన శనిగ్రహానికి ఉన్నట్టుగా దీని చుట్టూ ఎలాంటి వలయాలు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకూ సౌరకుటుంబం వెలుపల గుర్తించిన గ్రహాల్లో హెచ్‌డీ 209458బి అనే గ్రహంపై శాస్త్రవేత్తలు ఎక్కువగా పరిశోధనలు సాగించారు. ఈ కొత్త గ్రహం కెల్ట్‌-6బి కూడా దీన్ని పోలి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

More Telugu News