Virat Kohli: కోహ్లీ బహుశా ఐపీఎల్‌ కూడా ఆడకపోవచ్చు: సునీల్ గవాస్కర్

  • ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో లేకపోవడంపై మాజీ దిగ్గజం వ్యంగ్యాస్త్రాలు
  • రాంచీలో స్టార్ స్పోర్ట్స్ ఈవెంట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన గవాస్కర్
  • ధ్రువ్ జురెల్ ఐపీఎల్‌లో సూపర్ స్టార్‌గా మారే అవకాశం ఉందని ప్రశంసలు
  • ఆర్సీబీకి ఆడబోతున్న ఆకాశ్ దీప్ కూడా మెరిసిపోవచ్చని విశ్లేషణ
Virat Kohli might not even play upcoming IPL says Sunil Gavaskar

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అతడి భార్య అనుష్క శర్మ ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో విరాట్ తిరిగి జట్టుకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే స్వదేశంలో ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌లో ఆడకపోవడంపై భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం విరాట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ ఆడబోతున్న విరాట్ పరుగుల దాహం తీర్చుకోబోతున్నాడా? అని ప్రశ్నించగా.. ‘అతడు ఐపీఎల్ ఆడతాడా?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘విరాట్ కోహ్లీ బహుశా ఐపీఎల్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఏదో కారణం వల్ల అతను ఆడకపోవచ్చు.." అన్నారు గవాస్కర్. స్టార్ స్పోర్ట్స్ ‘స్టార్ ఈవెంట్’లో భాగంగా రాంచీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులతో గవాస్కర్ మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాగా ఐపీఎల్2024 ఎడిషన్ మార్చి 22న ఆరంభం కానుంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. 

ఇక, రాంచీ టెస్టులో టీమిండియా విజయానికి ప్రధాన కారణమైన యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌పై గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వికెట్ కీపర్-బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఈ ఏడాది ఐపీఎల్‌లో సూపర్‌స్టార్ కావచ్చునని గవాస్కర్ అన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ధ్రువ్ జురెల్ స్థానాన్ని ముందుకు జరిపే అవకాశం ఉందన్నాడు. టెస్ట్ మ్యాచ్‌లో ఈ స్థాయి ప్రదర్శన చూస్తుంటే జురెల్ సూపర్ స్టార్ కావచ్చని అన్నారు. కాగా ఆడిన రెండవ టెస్ట్‌ మ్యాచ్‌లోనే జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 39 (నాటౌట్) పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కించుకున్న విషయం తెలిసిందే.

 ఇక అరంగేట్ర మ్యాచ్‌లో ఆకట్టుకున్న పేపర్ ఆకాష్ దీప్ కూడా ఈ ఏడాది ఐపీఎల్‌లో మరింత వెలుగులోకి రానున్నాడని గవాస్కర్ పేర్కొన్నారు. గత సీజన్‌లో ఆర్సీబీకి మైనస్‌గా ఉన్న డెత్ ఓవర్ స్పెషలిస్ట్ పాత్రను ఆకాశ్ దీప్ పోషించగలడని గవాస్కర్ విశ్లేషించారు. ఇక హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడానికి ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయాన్ని గవాస్కర్ మెచ్చుకున్నారు. రోహిత్ శర్మ జట్టును నడిపించే అదనపు బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు.

కారు ప్రమాదానికి గురై కోలుకుంటున్న రిషబ్‌ పంత్ ఎంట్రీ విషయంలో తొందర అవసరం లేదని గవాస్కర్ వ్యాఖ్యానించారు. తాను కూడా పంత్ పెద్ద అభిమానినని, అతడు మునుపటిలా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని, సంపూర్ణ ఫిట్‌నెస్‌తో ఉంటే మాత్రమే అలరించగలడని అన్నారు. మునుపటిలా బ్యాటింగ్ చేయడానికి పంత్‌కు కొంత సమయం పడుతుందని, ప్రాక్టీస్ ప్రారంభించడం మంచి పరిణామమని వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News