Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవికి విజయ్ శేఖర్ శర్మ రాజీనామా

  • ఆర్బీఐ ఆంక్షలతో కుదుపులకు గురైన పేటీఎం
  • పేటీఎం నిబంధనలు పాటించడంలేదన్న ఆర్బీఐ
  • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు మెంబరు హోదాను కూడా వదులుకున్న శర్మ
Vijay Shekhar Sharma resigned to PPBL

ఇప్పటికే ఆర్బీఐ ఆంక్షలతో సతమతమవుతున్న ప్రముఖ చెల్లింపుల పోర్టల్ పేటీఎం మరోసారి కుదుపులకు లోనైంది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పీపీబీఎల్ లో బోర్డు మెంబరు హోదాను కూడా వదులుకున్నారు. 

నిబంధనలు పాటించడంలేదంటూ... డిపాజిట్లు స్వీకరించడం, క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, టాప్ అప్స్, ప్రీపెయిడ్ చెల్లింపులు, వ్యాలెట్లు, ఫాస్టాగ్ లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులను నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ను ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో, విజయ్ శేఖర్ శర్మ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. 

కాగా, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ గా నాలుగైదు బ్యాంకులతో భాగస్వామ్యం కోరుతూ పేటీఎం దాఖలు చేసుకున్న అభ్యర్థనను పరిశీలించాలని ఆర్బీఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)అని కోరింది.

భారత్ లో యూపీఐ చెల్లింపుల రంగంలో మూడో అతిపెద్ద యాప్ గా ఉన్న పేటీఎం త్వరలోనే యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, యెస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News