VH: ఖమ్మంలో చాలా కాలంగా పని చేస్తున్నాను... ఎంపీగా పోటీ చేస్తా: వీ.హెచ్

  • ఖమ్మం నుంచి పోటీ చేయాలని కేడర్ అడుగుతోందన్న వీ.హెచ్
  • పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారా? అని ప్రశ్న
  • అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, తాను ఎక్కువగా తిరిగామన్న వీ.హెచ్.
V Hanumantha Rao says he will contest in lok sabha polls

తాను ఖమ్మంలో చాలా కాలంగా పని చేస్తున్నానని... తనను అక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ కేడర్ అడుగుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానన్నారు. ఖమ్మంలో చాలా ఏళ్లుగా పని చేస్తున్నానని... ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని పేర్కొన్నారు. పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. అసలు దేశంలోనే నా కంటే ఎక్కువగా తిరిగిన నాయకుడు ఉన్నాడా? అన్నారు.

ఏం తప్పు చేశాను... నన్ను ఎందుకు పక్కన పెట్టారు? అని నిలదీశారు. కొత్తగా వచ్చిన వాళ్లే టిక్కెట్లు అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏమిటి? అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉందని... టిక్కెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తనపై పెట్టిన అక్రమ కేసులన్నింటిని తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలోనూ తనకు అన్యాయం జరిగిందన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, తాను ఎక్కువగా తిరిగామని... మిగతా నాయకులంతా నియోజకవర్గాలకే పరిమితమయ్యారన్నారు. తాను ఎంతోమంది నాయకులను తయారు చేశానన్నారు. రేవంత్ రెడ్డికి తాను మద్దతిచ్చానని... ఇకపై కూడా మద్దతు పలుకుతానన్నారు.

More Telugu News