Ration card EKYC: రేషన్ కార్డ్ ఈ-కేవైసీ పూర్తిచేశారా..? మరో మూడు రోజులే ఛాన్స్!

  • ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన కేంద్రం
  • ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు
  • రేషన్ కార్డుదారులను అలర్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
Ration card holders urged to complete EKYC process by Feb End

బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు గడువు సమీపిస్తోంది. ఈ నెలాఖరుతో గడువు పూర్తికానుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేసింది. ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే చేసుకోవాలని సూచించింది. రేషన్ కార్డు ఈ-కేవైసీని దగ్గర్లోని రేషన్ దుకాణంలో చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన కేంద్రం.. మరోమారు పొడిగించే అవకాశం లేదని అధికారవర్గాల సమాచారం. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 31 తోనే రేషన్ కార్డు గడువు ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ గడువును పొడిగించింది. ఈ నెలాఖరు వరకు ఈ-కేవైసీ పూర్తిచేసుకునేందుకు రేషన్ కార్డు దారులకు అవకాశం కల్పించింది. తాజాగా ఈ గడువు కూడా సమీపిస్తోంది.

అధికారుల లెక్కల ప్రకారం.. తెలంగాణలో 75 శాతం మంది రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ పూర్తిచేశారు. మిగిలిన 25 శాతం కార్డుదారులు వెంటనే ఈ-కేవైసీ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈమేరకు గడువులోగా 100 శాతం ఈ-కేవైసీ పూర్తయ్యేలా చూడాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అధికారులకు సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ-కేవైసీ చేసుకోవడం ఇలా..
రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులందరూ దగ్గర్లోని రేషన్ దుకాణానికి వెళ్లి మీ రేషన్ కార్డు నంబర్ మరియు వేలిముద్రలు ఇవ్వాలి. ఇది మీ రేషన్ కార్డ్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఈ-కేవైసీ పూర్తయినట్లు రసీదు వస్తుంది. రాష్ట్రంలోని ఏ రేషన్ షాపు వద్ద అయినా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి వెళ్లాల్సిన అవసరమూ లేదని, వీలును బట్టి విడివిడిగా వెళ్లి పూర్తిచేయొచ్చని అధికారులు చెప్పారు.

More Telugu News