Rail Accident: అర్ధరాత్రి రైల్వే ట్రాక్‌పై ట్రక్ బోల్తా.. ఘోర ప్రమాదాన్ని తప్పించిన వృద్ధ దంపతులు

Elderly Couple in Tenkasi Saves Train from Derailment
  • ప్లైవుడ్ లోడుతో వెళ్తూ రైల్వే ట్రాక్‌పై బోల్తాపడిన ట్రక్
  • తమిళనాడులోని తేన్‌కాశీ జిల్లాలో ఘటన
  • భారీ శబ్దానికి నిద్రలేచి టార్చిలైటుతో ఘటనా స్థలానికి చేరుకున్న వృద్ధ దంపతులు
  • అదే సమయంలో రైలు వస్తుండడంతో చేతులు ఊపుతూ లోకోపైలట్‌ను అప్రమత్తం చేసిన వైనం
  • సరిగ్గా ప్రమాద స్థలం వరకు వచ్చి ఆగిన రైలు
రైలు ప్రమాదాన్ని నివారించిన ఓ వృద్ధ జంట వందలాదిమంది ప్రాణాలను కాపాడింది. ఆ దంపతులు కనుక మనకెందుకులే అనుకుని ఉంటే ఈసారికే తమిళనాడులోని తేన్‌కాశీ జిల్లా భగవతీపురం రైల్వే స్టేషన్‌ ప్రయాణికుల హాహాకారాలతో హృదయవిదారకంగా ఉండేది. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. కేరళ నుంచి ప్లై‌వుడ్ లోడుతో కుంభకోణం వెళ్తున్న ఓ ట్రక్ అర్ధరాత్రివేళ ట్రాక్ దాటుతూ సరిగ్గా ట్రాక్ మధ్యలో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ట్రక్ బోల్తా పడినప్పుడు పెద్ద శబ్దం రావడంతో సమీపంలో నివసించే వృద్ధ దంపతులు షణ్ముగయ్య- కురుంథమ్మాళ్ టార్చిలైటుతో అక్కడికి చేరుకున్నారు. కాసేపటికి అదే ట్రాక్‌పై నుంచి రైలు దూసుకొస్తుండడంతో దంపతులు అప్రమత్తమయ్యారు. 

తమ చేతిలో ఏమీ లేకున్నా సరే ట్రాక్‌పై నిల్చుని చేతిలోని టార్చ్ లైటు ఊపుతూ లోకోపైలట్‌కు సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన లోకోపైలట్ బ్రేకులు వేయడంతో రైలు సరిగ్గా ప్రమాద స్థలానికి వచ్చి ఆగింది. అప్పటికే తెల్లారడంతో స్థానికులు, అధికారుల సాయంతో ట్రక్‌ను తొలగించి ట్రాక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటన కారణంగా చెన్నై ఎగ్మోర్-కొల్లాం ఎక్స్‌ప్రెస్ రైలు రెండు గంటలకుపైగా ఆలస్యమైంది. పెను ప్రమాదాన్ని తప్పించిన షణ్ముగయ్య- కురుంథమ్మాళ్ దంపతులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Rail Accident
Tamil Nadu
Tenkasi

More Telugu News