Indian Woman: తియ్యటి మాటలు చెప్పి ఉన్నదంతా ఊడ్చేశాడు.. అమెరికాలో మోసపోయిన భారత సంతతి మహిళ

  • డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు
  • కష్టపడి కూడబెట్టుకున్న 4.5 లక్షల డాలర్లు కాజేసిన జర్మనీ పౌరుడు
  • ఫిలడెల్ఫియాలో ‘పిగ్ బుచరింగ్’ సైబర్ మోసం
How Indian Woman In US Lost Life Savings To Scammer She Met On Hinge

విడాకులు తీసుకున్న భారత సంతతి అమెరికన్ మహిళకు డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి తియ్యటి మాటలతో వల వేశాడు.. ఇంకా ఎన్నాళ్లు కష్టపడతావు, నాలా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టు, ఊహకు అందని లాభాలు పొందొచ్చని ఊరించాడు. కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టిన మహిళను నమ్మించేందుకు భారీ మొత్తంలో లాభాలు చూపించాడు. ఆ సొమ్మును బ్యాంకు ఖాతాలోకి మార్చుకునేలా చేసి విశ్వాసం కలిగించాడు. దీంతో పూర్తిగా నమ్మిన బాధితురాలు.. తను జీవితాంతం కష్టపడిన సొమ్ముతో పాటు అందినకాడల్లా అప్పు చేసి 4.5 లక్షల డాలర్లు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిగా పెట్టింది. ఆన్ లైన్ లో భారీ మొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపిస్తున్నా.. ఆ సొమ్మును బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకునేందుకు వీలు లేకుండా ఆపేయడంతో జరిగిన మోసం బయటపడింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పిగ్ బుచరింగ్ గా వ్యవహరించే ఈ తరహా కేసులు అమెరికాలో ఇటీవల బాగా పెరుగుతున్నాయని పోలీసులు చెప్పారు.

భారత సంతతికి చెందిన శ్రేయ దత్తా (37) ఫిలడెల్ఫియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కొంతకాలం కిందట భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి ఆమెను ఆకర్షించాడు. నెలల తరబడి ఛాటింగ్ చేస్తూ బాగా నమ్మించాడు. అనతికాలంలోనే వారి పరిచయం వాట్సాప్ లో ఛాటింగ్ కు దారితీసింది. తన పేరు ఆన్సెల్ అని, తానొక వైన్ ట్రేడర్ నని చెప్పుకున్నాడు. ఇంకా ఎంతకాలం ఉద్యోగంలో కష్టపడతావంటూ సానుభూతి చూపిస్తూ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని చెప్పాడు. ఓ లింక్ పంపించి పెట్టుబడులు పెట్టాలని సూచించాడు.

అప్పటికే ఆన్సెల్ ను పూర్తిగా నమ్మేసిన దత్తా.. తొలుత ఆ యాప్ లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టింది. భారీ మొత్తంలో లాభాలు రావడం, సొమ్మును బ్యాంకు ఖాతాలోకి సులభంగా మళ్లించుకునే ఆప్షన్ ఉండడంతో దత్తాకు నమ్మకం కుదిరింది. దీంతో రిటైర్మెంట్ కోసం దాచుకున్న సొమ్మంతా అందులో పెట్టుబడి పెట్టింది. స్నేహితులు, పరిచయస్తుల దగ్గర వీలైనంత అప్పు చేసి మరీ ఆ యాప్ లో పెట్టింది. తన పెట్టుబడికి భారీగా రిటర్న్ లు వచ్చినట్లు యాప్ లో చూపించడంతో సంబరపడింది. అయితే, ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు దత్తా చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన దత్తా.. పోలీసులను ఆశ్రయించింది.

ఉన్నదంతా పోగొట్టుకున్నానని తెలిసి మానసికంగా కుంగిపోయినట్లు దత్తా పేర్కొంది. ప్రస్తుతం మానసిక వైద్యుల వద్ద దత్తా చికిత్స తీసుకుంటోంది. కాగా, ఇలాంటి కేసులు ఇటీవల పెరుగుతున్నాయని, గతేడాది మొత్తం 40 వేల మంది ఫిర్యాదు చేశారని ఎఫ్ బీఐ అధికారులు చెప్పారు. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని, చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని చెబుతున్నారు. గతేడాదిలో ఫేక్ క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరస్థులు 3.5 బిలియన్ డాలర్లు కొట్టేశారని తెలిపారు.

More Telugu News