Dhruv Jurel: ధ్రువ్ జురెల్‌కి మీడియాలో హైప్ రాలేదు.. కానీ అద్భుతంగా ఆడాడు: వీరంద్ర సెహ్వాగ్

  • దక్కిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడని ప్రశంస
  • జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చక్కగా ఆడాడని అభినందనలు
  • సర్ఫరాజ్ ఖాన్ విషయంలో ఎందుకు స్పందించలేదని సెహ్వాగ్ కు నెటిజన్ల ప్రశ్నలు 
Dhruv Jurel did not get the hype in the media says Virender Sehwag

ఇండియా, ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పట్టుబిగించడంలో యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో జురెల్ అద్భుత ఆటతీరును కనబరిచాడు. 90 పరుగులు చేసి భారత్ స్కోరు 300 దాటడంలో కీలక పాత్ర పోషించాడు. జురెల్ సెంచరీ చేయకపోయినప్పటికీ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 46 పరుగులకు తగ్గించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో జురెల్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ జాబితాలో టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరిపోయాడు.    

ధ్రువ్ జురెల్‌కి మీడియాలో తగినంత హైప్ రాలేదు.. కానీ తనకు దక్కిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడని సెహ్వాగ్ అభినందించాడు. ‘‘మీడియా హైప్ లేదు. ఎలాంటి డ్రామా లేదు. అద్భుతమైన నైపుణ్యాలు. అత్యంత సంక్లిష్ట సమయంలో చక్కటి ప్రదర్శన. వెరీ వెల్‌డన్ ధ్రువ్ జురెల్. నీకు శుభాభినంనదలు’’ అంటూ ఎక్స్ వేదికగా సెహ్వాగ్ స్పందించాడు. అయితే సెహ్వాగ్ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆటగాళ్లను బట్టి మాజీ ఆటగాడు స్పందిస్తున్నాడని కొందరు విమర్శించారు. సర్ఫరాజ్ ఖాన్ విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సర్ఫరాజ్ ఖాన్ చాలా దేశవాళీ క్రికెట్ ఆడాడని, ధ్రువ్ జురెల్ చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడని చెబుతున్నారు.

More Telugu News