RTC bus: ఏపీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

  • రోడ్డు పక్కన లారీ టైర్ మార్చుతున్న వారి పైనుంచి దూసుకెళ్లిన సూపర్ లగ్జరీ బస్సు
  • ముగ్గురు డ్రైవర్లు, ఒక క్లీనర్ దుర్మరణం
  • పత్తిపాడు హైవేపై చోటుచేసుకున్న ప్రమాదం
  • ప్రమాదం తర్వాత ఆగకుండా వెళ్లిపోయిన బస్సు.. సమాచారం మేరకు రాజమండ్రి సమీపంలో గుర్తించి ఆపిన పోలీసులు
RTC bus got road accident and 4 killed in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పత్తిపాడు హైవేపై పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన లారీ ఆపి టైర్ మార్చుతున్న నలుగురు వ్యక్తుల పైనుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు లారీ డ్రైవర్లు, ఒక క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ-చిన్నంపేట హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఒక లారీ టైరుకు పంక్చర్ కావడంతో దానిని రోడ్డు పక్కన ఆపారు. టైర్ మార్చడంలో వీరికి సహాయంగా మరో లారీ డ్రైవర్, క్లీనర్ కూడా వచ్చారు. వీరంతా టైర్ మార్చడంలో నిమగ్నమవ్వగా బస్సు వీరి పైనుంచి దూసుకెళ్లింది.

ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే స్థానికులు సమాచారం అందించడంతో రాజమండ్రి సమీపంలోని మొమ్మూరు వద్ద పోలీసులు బస్సును గుర్తించి ఆపారు. నిందిత డ్రైవర్‌ను గుర్తించారు. మృతులను దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, నాగయ్య, రాజులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు చెందినవారని, ఒకరు ప్రత్తిపాడుకు చెందినవారని పోలీసులు వివరించారు.

More Telugu News