Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు విరుగుడు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!

  • నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చే దిశగా రేవంత్ సర్కార్ ప్రయత్నాలు 
  • భూగర్భ సొరంగాల నిర్మాణంతో సమస్య పరిష్కారమవుతుందన్న అధికారులు
  • ఈ మేరకు పలు మార్గాల్లో సొరంగాల నిర్మాణానికి డీపీఆర్‌లు రెడీ చేస్తున్న వైనం
CM Revanth Reddys Key Decision on Hyderabad Traffic

హైదరాబాద్‌లో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక యోచన చేస్తోంది. పలు మార్గాల్లో సొరంగాలు నిర్మించే ఆలోచన చేస్తోంది.  

ప్రస్తుతం నగరంలో రోడ్డు విస్తరణకు అనేక ఇబ్బందులు ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో, పరిష్కారమార్గాలపై దృష్టి సారించిన అధికారులు అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణమే సరైన పరిష్కారమనే నిర్ణయానికి వచ్చారు. 

నగరంలో ప్రస్తుతం 12 వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో 500 నుంచి 700 కిలోమీటర్ల రోడ్లు ఇరుకైనవే. ఈ రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు అధిక సమయంలో ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వస్తోంది. ప్రయాణాల సందర్భంగా గంటన్నర నుంచి 2 గంటల సమయం వృథా అవుతోంది. రోడ్ల విస్తరణకు పెద్ద పెద్ద భవనాలు అడ్డుగా ఉండటంతో టన్నెళ్ల నిర్మాణమే మంచి పరిష్కారమని ప్రభుత్వ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు. టన్నెల్స్‌ పరిష్కారం మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. 

ఇక నగరంలో టన్నెల్స్ నిర్మాణానికి కొన్ని ప్రతిపాదనలు కూడా రెడీ అవుతున్నాయి. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా మూడు మార్గాల్లో టన్నెల్స్ నిర్మించనున్నారు. 39 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాల నిర్మాణాలకు డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. 

ఐటీసీ కోహినూర్ నుంచి ఖాజాగూడ, నానక్‌రామ్‌గూడ మీదుగా విప్రో సర్కిల్ వరకూ 9 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు.  అదే విధంగా, ఐటీసీ కోహినూర్ నుంచి మైండ్‌స్పేస్ జంక్షన్ మీదుగా జేఎన్‌టీయూ వరకూ 8 కిలోమీటర్ల మేర మరో సొరంగం నిర్మిస్తారు. వీటితో పాటు, ఐటీసీ కోహినూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-45 మీదుగా రోడ్ నెంబర్-10 వరకూ 7 కిలోమీటర్ల మేర మరో టన్నెల్ సిద్ధం చేస్తారు. ఇక జీవీకే మాల్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా నానల్‌నగర్ వరక 6 కిలోమీటర్ల టన్నెల్ మార్గం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నాంపల్లి నుంచి చార్మినార్ మీదుగా చాంద్రాయణగుట్ట ఇన్నర్ రింగ్‌రోడ్డు వరకూ 9 కిలోమీటర్ల టెన్నెల్ నిర్మించనున్నారు. 

హైదరాబాద్‌లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వన్‌వేలోనే ఉండటంతో టన్నెళ్ల నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు. జాకింగ్ సిస్టమ్ ద్వారా సొరంగాల నిర్మాణం చేపడతారని తెలుస్తోంది. ఈ టన్నెల్స్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకూ తగ్గుతాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

More Telugu News