TDP: కొలికపూడి, మహాసేన రాజేశ్ లకు తొలి జాబితాలోనే అవకాశం

Chandrababu announces two Dalit leaders names in TDP first list

  • 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన టీడీపీ
  • దళితనేతలు కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేశ్ లకు టికెట్లు
  • కొలికపూడికి తిరువూరు టికెట్... పి.గన్నవరం నుంచి రాజేశ్ కు అవకాశం

ఇవాళ తెలుగుదేశం పార్టీ 94 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ప్రకటించిన తొలి జాబితాలో ఇద్దరు దళిత నేతలు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా దళితుల సమస్యలపైనే కాదు, ప్రజా సమస్యలపైనా ఎలుగెత్తుతున్న ఆ నేతలే కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేశ్. వీరిద్దరిపై టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి నమ్మకం ఉంచారు. 

కొలికపూడి శ్రీనివాసరావుకు తిరువూరు టికెట్ ఇవ్వగా... పి.గన్నవరం నుంచి మహాసేన రాజేశ్ కు అవకాశం ఇచ్చారు. దళితనేతగా గుర్తింపు ఉన్న కొలికపూడి శ్రీనివాసరావు గతంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహించారు. అమరావతి రాజధాని సంక్షోభం మొదలయ్యాక రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ రైతుల తరఫున ఆయన పోరాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. కొలికపూడి ఇటీవలే టీడీపీలో చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. 

ఇక సరిపెళ్ల రాజేశ్ కుమార్ అలియాస్ మహాసేన రాజేశ్ ది మరో కథ. మహాసేన రాజేశ్ గత ఎన్నికల వరకు వైసీపీతో సన్నిహితంగా ఉన్నారు. జగన్ కు బలమైన మద్దతుదారు అనే గుర్తింపును సొంతం చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మహాసేన రాజేశ్ ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించడం మొదలుపెట్టారు. తన యూట్యూబ్ చానల్ ద్వారా వైసీపీ సర్కారును ఏకిపారేస్తూ ఎంతో పాప్యులర్ అయ్యారు. మహాసేన రాజేశ్ జనసేనలో చేరతారని భావించినప్పటికీ, ఆయన టీడీపీలోకి వచ్చారు.

  • Loading...

More Telugu News