Raghu Rama Krishna Raju: పబ్లిగ్గా ఏడవకండి... ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది: సజ్జలపై రఘురామ వ్యాఖ్యలు

  • 99 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, జనసేన
  • జగన్ 6 విడతల్లో 60 స్థానాలు ప్రకటించాడన్న రఘురామ
  • బాబు, పవన్ పావుగంటలో 99 స్థానాలు ప్రకటించారని వెల్లడి
  • పవన్ ప్రజా సంక్షేమం కోసమే తక్కువ సీట్లకు ఒప్పుకున్నాడని స్పష్టీకరణ
  • పవన్ పై వైసీపీ నేతలు ఏడుస్తున్నారని విమర్శలు
Raghu Rama Krishna Raju comments on Sajjala and other YCP leaders

జగన్ 6 విడతల్లో 60 స్థానాలు ప్రకటిస్తే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పావుగంటలో 99 స్థానాలు ప్రకటించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. బీజేపీ కూడా పొత్తులోకి వస్తే మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటిస్తారని వివరించారు. 

సీట్లు తక్కువ అయినప్పటికీ ప్రజా సంక్షేమం కోసమే జనసేనాని పవన్ కల్యాణ్ ఒప్పుకున్నారని కొనియాడారు. అయితే, సజ్జల అయ్యో పాపం అంటూ పవన్ కల్యాణ్ గురించి బాధపడ్డారని వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఇవాళ తమ అభ్యర్థులను ప్రకటించే సమయంలో చంద్రబాబు నవ్వుతూ ఉల్లాసంగా కనిపించారని, పవన్ కల్యాణ్ సహజంగానే ఎప్పుడూ నవ్వుతూ ఉంటారని రఘురామ వివరించారు. టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన సందర్భంగా చంద్రబాబు, పవన్ ల ముఖాల్లో ఆనందం కనిపించిందని, దాంతో వైసీపీ నేతలకు ఏడుపే మిగిలిందని ఎద్దేవా చేశారు. పబ్లిగ్గా  ఏడవకండి... ఏడిస్తే దరిద్రంగా ఉంటుందని సజ్జలకు విన్నవించుకుంటున్నానని రఘురామ తన రచ్చబండ కార్యక్రమంలో పేర్కొన్నారు. 

"పవన్ గురించి ప్రభుత్వ సలహాదారు సజ్జల బాధపడడం విడ్డూరంగా ఉంది. సజ్జల గారి విలాపం చూస్తుంటే జాలి కలుగుతోంది. పవన్ 60 నుంచి 70 స్థానాలను కోరుకుంటారని భావిస్తే 24 స్థానాలకు పరిమితం అయ్యారంటూ సజ్జల ఏడవడం ఆశ్చర్యంగా అనిపించింది. మా పార్టీలు, మా పొత్తులను మేం చూసుకుంటాం... ఇప్పటికైనా సజ్జల తన ఏడుపు మానాలని కోరుకుంటున్నాం" అంటూ రఘురామ పేర్కొన్నారు. 

కాగా, తన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని భీమవరం నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేయాలని రఘురామ ఆకాంక్షించారు. భీమవరంలో పవన్ 50 వేల మెజారిటీతో ఘనవిజయం సాధిస్తారని అభిప్రాయపడ్డారు. కుల మతాలకు అతీతంగా పవన్ ను గెలిపించుకుంటామని చెప్పారు.

More Telugu News