Idli: ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

idli is damaging biodiversity new study shocking report
  • జీవ వైవిధ్యానికి ముప్పుగా ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలు
  • అగ్రస్థానంలో స్పానిష్ రోస్ట్ ల్యాంబ్ డిష్ ‘లెచాజో‘
  • ఆరోస్థానంలో ఇడ్లీ, ఏడో స్థానంలో రాజ్మాకూర
  • పప్పు ధాన్యాలతో కూడిన ఆహారం వల్ల జీవవైవిధ్యంపై తీరని ప్రభావం
  • అనేక జీవజాతులు ఆవాసం కోల్పోతున్నాయన్న అధ్యయనం
వేడి వేడి ఇడ్లీ.. కొద్దిగా నెయ్యి, కారంపొడి తగిలించి తింటే.. ఆహా ఆ టేస్టే వేరు! దక్షిణ భారతదేశ ప్రజలకు ఇష్టమైన టిఫిన్‌లలో ఇడ్లీదే అగ్రస్థానం. అలాంటి ఇడ్లీ వల్ల జీవవైవిధ్య ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఇదొక్కటే కాదు ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలు జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమించాయని అధ్యయనం పేర్కొంది. వాటిలో ఇడ్లీతోపాటు చనా మసాలా (శనగల మసాలా కూర), రాజ్మా, చికెన్ జాల్‌ఫ్రెజి వంటివి ఉన్నాయి. పర్యావరణానికి ముప్పుగా పరిణమించే తొలి 25లో భారతీయులు ఇష్టంగా తినేవే ఉండడం గమనార్హం. 

ఈ జాబితాలో స్పానిష్ రోస్ట్ ల్యాంబ్ డిష్ అయిన ‘లెచాజో’ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్‌కు చెందిన మీట్ సెంట్రిక్ ఆఫెరింగ్స్ ఉంది. ఈ జాబితాలో ఇడ్లీ ఆరోస్థానంలో ఉండగా రాజ్మా కూర ఏడో స్థానంలో ఉంది. ఈ అధ్యయన వివరాలు  సింగపూర్ యూనివర్సిటీలోని ఎలిస్సా చెంగ్ అండ్ కొలీగ్స్  నిర్వహించే ఓపెన్ యాక్సెస్ జర్నల్ ప్లాస్ (పీఎల్‌వోఎస్)లో ప్రచురితమైంది. అయితే, ఆశ్ఛర్యకరంగా శాకాహారులు, శాకాహార వంటకాలు.. మాంసాహార వంటకాలతో పోలిస్తే తక్కువ జీవ వైవిధ్య ఫుట్‌ప్రింట్స్ కలిగి ఉండడం గమనార్హం. అయితే, బియ్యం, పప్పుధాన్యాల ఆధారిత వంటకాలు కూడా అధిక స్కోరు సాధించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. 

వ్యవసాయం చేసే ప్రదేశాల్లో క్షీరదాలు, పక్షులు, ఉభయచర జీవులపై పడే ప్రభావాన్ని పరిశోధకులు అంచనా వేశారు. బియ్యం, పప్పుధాన్యాలతో కూడిన ఆహారం వల్ల జీవ వైవిధ్యంపై అధిక ప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. మన దేశంలో ధాన్యం, పప్పు ధాన్యాల సాగుకు తరచుగా భూమార్పిడి అవసరమని, ఈ కారణంగా అనేక జీవజాతులు ఆవాసాలు కోల్పోతున్నాయని అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.
Idli
Rajma Curry
Biodiversity
India
Chana Masala
Study

More Telugu News