Karnataka Temple Tax: కర్ణాటక ప్రభుత్వానికి షాక్.. దేవాలయాల బిల్లుకి మొకాలడ్డిన శాసన మండలి!

  • కర్ణాటక అధికాదాయ దేవాలయాలపై పన్ను విధించేందుకు కొత్త ఎండోమెంట్స్ బిల్లు
  • రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు నెగ్గినా మండలిలో మాత్రం బిల్లు వీగిపోయిన వైనం
  • పెద్దల సభలో బీజేపీకి మెజారిటీ ఉండటంతో బిల్లుకు బ్రేకులు
Karnataka Bill To Tax Temples Defeated in Council

కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. అధికాదాయ దేవాలయాలపై పన్ను విధించేందుకు ఉద్దేశించిన ఎండోమెంట్స్ బిల్లు పెద్దల సభలో వీగిపోయింది. కౌన్సిల్‌ (శాసన మండలి)లో బీజేపీకి బలం ఉండంతో అధికార పక్షం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అసెంబ్లీలో ఈ బిల్లు పాసైనా పెద్దల సభలో మాత్రం నిలవలేకపోయింది. కర్ణాటక పెద్దల సభలో కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్సీలు ఉండగా, బీజేపీ ఎమ్మెల్సీలు 35 మంది, జేడీఎస్ ఎమ్మెల్సీలు 8 మంది, ఒక స్వతంత్ర ఎమ్మెల్సీ ఉన్నారు. 

హిందూ దేవాలయాలపై ఆదాయపు పన్ను విధించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు కర్ణాటకలో కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ప్రకారం, రూ. కోటిపైన ఆదాయం ఉన్న దేవాలయాల నుంచి 10 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఆదాయం ఉన్న దేవాలయాలపై 5 శాతం పన్ను విధిస్తారు. రెండు రోజుల క్రితమే ఈ బిల్లను అసెంబ్లీ పాస్ చేసింది. 

మరోవైపు, ఇది హిందూ వ్యతిరేక చట్టమంటూ బీజేపీ అధికార పార్టీపై మండిపడింది. ఇతర మతాల ప్రార్థనా సంస్థలపై ఇలాంటి పన్నులు ఎందుకు విధించరని ప్రశ్నించింది. బీజేపీ ఆరోపణలను సిద్దరామయ్య ప్రభుత్వం తోసి పుచ్చింది. బీజేపీ కూడా గతంలో దేవాలయాలపై పన్నులు వసూలు చేసిన విషయాన్ని పేర్కొంది. దేవాలయాల పన్ను ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాల కోసం వినియోగిస్తామని కూడా పేర్కొంది.

More Telugu News