Mahalakmi Scheme: మహాలక్ష్మి పథకం.. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై నగదు బదిలీకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు

Telangana govt prefers cash transfer for implement subsidized gas cylinders scheme

  • ఆయిల్ కంపెనీల నిబంధనలు, ఇతర ఆర్థిక అంశాల ఆధారంగా సబ్సిడీ వైపు మొగ్గు
  • ఇందుకు సంబంధించిన విధివిధానాల ఖరారు
  • సిలిండర్ తీసుకునేటప్పుడు లబ్ధిదారులు మొత్తం ధర చెల్లించాలి
  • అనంతరం, వారి బ్యాంకు ఖాతాలోకి రూ.500 పోను మిగిలిన మొత్తం బదిలీ
  • నగదు బదిలీకి ప్లాట్‌ఫాం‌గా ఎన్‌‌పీసీఐ

మహాలక్ష్మి పథకం కింద సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌‌ల సరఫరాపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నగదు బదిలీ విధానంలోనే రూ.500కు గ్యాస్ సిలిండర్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానంలో వినియోగదారులు సిలిండర్ తీసుకునేటప్పుడు పూర్తి ధర చెల్లిస్తారు. ఆ తరువాత ప్రభుత్వం రూ.500 సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది. ఇక పథకం అమలుకు సంబంధించి వివిధ విధానాలను కూడా పౌరసరఫరాల శాఖ ఖరారు చేసింది. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రూ.500కే సిలిండర్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

రూల్స్ ఇవే..
  • కొత్తగా తీసుకునే గ్యాస్ కనెక్షన్లకు పథకం వర్తించదు. ఆహారభద్రత కార్డులున్న వారికి, అందునా వాడకంలో ఉన్న సిలిండర్లకే సబ్సిడీ వర్తింపు
  • గృహవినియోగదారులు గడిచిన మూడేళ్లలో వినియోగించిన సగటు సిలిండర్ల సంఖ్య ఆధారంగా సబ్సిడీ సిలిండర్ల సంఖ్య ఖరారు
  • ప్రస్తుతానికి 40 లక్షల మంది మహిళా అభ్యర్థుల ఖరారు. వీరితోనే పథకం ప్రారంభం
  • ఈ పథకంలో నగదు బదిలీకి ప్లాట్‌ఫాంగా వ్యవహరించనున్న ఎన్‌పీసీఐ. లబ్ధిదారులకు సిలిండర్ల సరఫరా తరువాత ఎన్‌పీసీఐ.. నోడల్ బ్యాంకులో ఉన్న సొమ్ము నుంచి లబ్ధిదారులకు నగదు బదిలీ చేస్తుంది. 

ఆయిల్ కంపెనీల నిబంధనలు, ఇతర ఆర్థిక అంశాలు, అవకతవకలు జరిగే అవకాశం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

కాగా, పౌరసరఫరా శాఖ కమిషనర్ గురువారం సాయంత్రం గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగింది.

  • Loading...

More Telugu News