Kanakamedala Ravindra Kumar: ఇళ్ల నిర్మాణానికి జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: కనకమేడల

  • 25 లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన జగన్ 5 లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించారన్న కనకమేడల
  • పనికిరాని స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేశారని విమర్శ
  • వాలంటీర్లతో ఇప్పుడు కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారని మండిపాటు
Jagan not even gave 1 rupee for house constructions says Kanakamedala

పేదలకు ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లను నిర్మించి ఇస్తానని చెప్పిన సీఎం జగన్... నాలుగేళ్ల 10 నెలల్లో కేవలం 5 లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించారని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. జనావాసాలకు దూరంగా నివాసాలకు పనికిరాని స్థలాల్లో పేదలకు సెంటు పట్టాలు ఇచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. ఇళ్ల నిర్మాణానికి జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.... కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బును తానే ఇస్తున్నట్టు ప్రజాధనంతో ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. 

టీడీపీ హయాంలో 2.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను 90 శాతం పూర్తి చేశామని... మిగిలిన 10 శాతాన్ని పూర్తి చేయకుండా వాటిని జగన్ గాలికొదిలేశారని కనకమేడల విమర్శించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులను వీధులపాలు చేశారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రజల్ని వంచించడమే కాక, భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. చేసినదానికి భిన్నంగా సాక్షి దినపత్రికలో మోస పూరిత ప్రకటనలతో ప్రజల్ని వంచిస్తున్నారని విమర్శించారు. చివరకు ఎన్నికలు సమీపిస్తుండటంతో పేదల్ని మరోసారి వంచించడానికి వాలంటీర్లు, వైసీపీ శ్రేణులతో జగన్ కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారని అన్నారు. 

More Telugu News