Jagan: గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి: ఒంగోలులో సీఎం జగన్

  • ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
  • పేదలకు ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తున్నామని వెల్లడి
  • పేదల ఆత్మగౌరవం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు
  • పెత్తందార్లకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇచ్చారని వ్యాఖ్యలు
CM Jagan asks look into the difference between present govt and past govt

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి అని సూచించారు. 

చరిత్రలోనే తొలిసారిగా పేదలకు ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తున్నామని, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం కానీ, ఈ రిజిస్ట్రేషన్ భూములను కబ్జా చేయడం కానీ వీలుపడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. పట్టా ఉండడం వల్ల బ్యాంకుల నుంచి లోన్లు కూడా వస్తాయని వివరించారు. పేదల అభ్యున్నతి, ఆత్మగౌరవంపై గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని విమర్శించారు. 

ఆరోగ్య శ్రీని రూ.25 లక్షలకు పెంచామని, పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, ఆరోగ్య శ్రీ కింద అందించే చికిత్సా విధానాల సంఖ్యను 3,300కి పెంచామని సీఎం జగన్ పేర్కొన్నారు. పేదలకు ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు అందించామని తెలిపారు.

గత ప్రభుత్వంలో పెత్తందార్లకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇస్తే... తాము వచ్చాక బడుగు బలహీన వర్గాల వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని సీఎం జగన్ అన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువు కోసం ద్విభాషా పుస్తకాలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ లు ఇచ్చామని, గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ విద్యాబోధన తీసుకువచ్చామని తెలిపారు. 

ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా విద్యా ప్రమాణాలు పెంచుతున్నామని వివరించారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు ఎలా మారిపోయాయో అందరూ గమనించాలని అన్నారు.

More Telugu News