US Cities Sinking: ఊహకు అందనంత వేగంగా కుంగిపోతున్న అమెరికా నగరాలు!

  • భూమిలోకి కుంగిపోతున్న న్యూయార్క్, బాల్టిమోర్, నార్‌ఫోక్
  • 1 నుంచి 2 మీటర్లు కుంగిపోయినట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు
  • కుంగుబాటు కారణంగా 8.97 లక్షల నిర్మాణాలకు పొంచివున్న ముప్పు
  • అడవులు, వన్యప్రాణులపైనా ప్రభావం
US Cities Sinking Faster Than Thinking

భూతాపంతో సముద్ర మట్టాలు పెరుగుతూ అమెరికాలోని తూర్పుతీర ప్రాంతాలను భయపెడుతున్న వేళ అమెరికాకు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. న్యూయార్క్, బాల్టిమోర్, నార్‌ఫోక్ వంటి నగరాలు ఊహించిన దానికంటే వేగంగా భూమిలోకి కుంగిపోతున్నాయి. ఉపగ్రహ డేటా, జీపీఎస్ సెన్సార్లను ఉపయోగించి వర్జీనియా టెక్ ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు.

 2007-2020 మధ్య తూర్పుతీర ప్రాంతాలు 1 నుంచి 2 మిల్లీమీటర్లు కుంగిపోయినట్టు తెలిపారు. ఇది చాలా స్వల్పమే అయినప్పటికీ పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా ఈ ముప్పు పెద్దదిగానే భావించాలని పేర్కొన్నారు. దీని వల్ల మౌలిక సదుపాయాలు, కోట్లాదిమంది ప్రజలు ముప్పులో ఉన్నట్టేనని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను నాసా విడుదల చేసింది.

నగరాల కుంగుబాటు కారణంగా 8.97 లక్షల నిర్మాణాలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఉప్పునీరు చొచ్చుకురావడం, భూ క్షీణత వల్ల అడవులు దెబ్బతింటాయని, వన్యప్రాణులపై ప్రభావం పడడంతోపాటు మానవ నిర్మాణాలకూ ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అడవులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు వంటివి ప్రభావితమవుతాయని, వరదలు, తీర ప్రాంత ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే, డెలావర్, మేరీల్యాండ్, దక్షిణ కరోలినా, జార్జియాలలో కుంగుబాటు ముప్పు మరింత ఎక్కువగా ఉందని వివరించారు.

More Telugu News