TDP: ముగిసిన టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం... వివరాలు ఇవిగో!

TDP and Janasena coordination committee meet concluded

  • విజయవాడలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ కీలక భేటీ
  • మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్
  • టీడీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించారన్న అచ్చెన్నాయుడు
  • బీజేపీతో పొత్తుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని వెల్లడి
  • ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ

టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో ముగిసింది. ఈ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. పొత్తును స్వాగతించిన టీడీపీ-జనసేన కేడర్ ను అభినందిస్తూ ఒక తీర్మానం... మీడియాపై దాడులను తప్పుబడుతూ రెండో తీర్మానం చేశారు. 

కాగా, సమన్వయ కమిటీ సమావేశం అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని, వైసీపీ ప్రభుత్వం మన రాష్ట్రం పరువు తీసిందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోలేకపోతున్నారని, వైసీపీ పాలనను ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని అన్నారు. 

టీడీపీ-జనసేన మధ్య గొడవలు పెట్టేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఓడిపోతామని తెలిసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్ యత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే వైసీపీ నేతలు మీడియాపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. తమ సభలకు వచ్చే వారిని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇవాళ్టి సమన్వయ కమిటీ సమావేశంలో మీడియాపై దాడులను ఖండిస్తూ తీర్మానం చేశామని అచ్చెన్న వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో మాట్లాడుతున్నామని, త్వరలోనే పొత్తు గురించి ప్రకటన ఉంటుందని వెల్లడించారు. టీడీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించారని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని అన్నారు. 

ఇక, సాధ్యమైనంత త్వరగా ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తామని, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటుపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేయాలన్నది చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. 

రాష్ట్ర  శ్రేయస్సు దృష్ట్యా జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే పొత్తు పెట్టుకున్నామని వివరించారు. పొత్తుల్లో కొన్ని త్యాగాలు తప్పవని చంద్రబాబు, పవన్ చెప్పిన విషయాన్ని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేశారు. టికెట్లు రాని వాళ్లు బాధపడవద్దని ఇద్దరు అధినేతలు ఇప్పటికే చెప్పారని వెల్లడించారు. 

వాలంటీర్లను ఎన్నికల విధుల్లో నియమించరాదని, వాలంటీర్ల గురించి మాట్లాడిన మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేశామని అచ్చెన్నాయుడు చెప్పారు. 

రెండు పార్టీలు కలిసి పనిచేసే సమయం వచ్చింది: నాదెండ్ల

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నేటి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించుకున్నామని జనసేన పార్టీ  పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విపక్షాల ఓట్లు చీలకూడదని పవన్ పలుమార్లు చెప్పారని వివరించారు. రెండు పార్టీలు కలిసి పనిచేసుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు. కలిసి పనిచేయాలని జనసేన, టీడీపీ కార్యకర్తలను కోరుతున్నామని నాదెండ్ల పిలుపునిచ్చారు. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని అన్నారు. 

తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న ఉమ్మడి సభ

తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ ఉమ్మడి సభకు 500 మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరుకానున్నారని తెలిపారు. కాగా,  ఈ సభకు ఆరు లక్షల మంది వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉమ్మడి సభలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News