YS Sharmila: షర్మిలను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  • మెగా డీఎస్సీకి మద్దతుగా చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన షర్మిల
  • కరకట్ట వద్ద షర్మిల, ఇతర కాంగ్రెస్ నేతల అరెస్ట్
  • రెండు వాహనాల్లో వీరిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు
AP Police arrests YS Sharmila

అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో భాగంగా అక్కడకు వెళ్తుండగా కరకట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు నుంచి ఆమెను కిందకు దించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రోడ్డుపై బైఠాయించిన షర్మిల, ఇతర నేతలను పోలీసులు బలవంతంగా ఎత్తుకుని పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. అక్కడి నుంచి వారిని తరలించారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు సీఎం డౌన్ డౌన్, పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. మెగా డీఎస్సీని విడుదల చేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. పోలీసు వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో ఆమె అదుపు తప్పి వాహనం మెట్లపై పడిపోయారు. అయినా పోలీసులు తగ్గలేదు. రెండు పోలీసు వాహనాలలో వీరిని తరలించారు. ఇతర నేతలతో పాటే ఆమెను కూడా సాధారణ వాహనంలోనే తరలించడం గమనార్హం. వీరిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.

More Telugu News