Mohammad Hafeez: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెట్ బోర్డు మాజీ డైరెక్టర్

  • ఫిట్‌నెస్‌కు అసలు ప్రాధాన్యమే ఇవ్వలేదని హఫీజ్
  • ట్రైనర్ మాటలు విని విస్తుపోయానన్న టీం మాజీ డైరెక్టర్
  • ఆటగాళ్ల బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందని వ్యాఖ్య
  • ప్రస్తుతం అన్ని జట్లు ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయన్న హఫీజ్
Pak Cricket Board Ex Director Mohammad Hafeez Blasts Babar Azam For Poor Fitness Level

భారత్‌లో గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ దారుణ వైఫల్యంపై పాక్ క్రికెట్ బోర్డు మాజీ డైరెక్టర్ ముహమ్మద్ హఫీజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, విదేశీ కోచ్‌లు మిక్కీ అర్ధర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్ ఫిట్‌నెస్ గురించి అస్సలు పట్టించుకోలేదని, దానికి అసలు వారు ప్రాధాన్యమే ఇవ్వలేదని ఆరోపించాడు. ప్రపంచకప్ లీగ్ దశలో 9 మ్యాచుల్లో ఐదింటిలో ఓడిన పాక్ నాకౌట్ దశలోనే నిష్క్రమించింది. ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన తర్వాత 2023 చివర్లో హఫీజ్ టీం డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. కాగా, ఇటీవల అతడి కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. 

హఫీజ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను పాక్ వైట్‌వాష్ చేసింది. అయితే, ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌ను మాత్రం 1-4తో కోల్పోయింది. తాను జట్టు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై టీం ట్రైనర్‌ను నివేదిక కోరానని, ఫిట్‌నెస్ కోసం కొత్త నియమావళిని సిద్ధం చేయాలని కోరానని గుర్తు చేసుకున్నాడు. 

దానికి ఆయన చెప్పిన సమాధానం విని షాకయ్యానని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌కు అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదని, ఆటగాళ్లు వాళ్లు కోరినట్టు ఆడితే చాలని ఆరు నెలల క్రితం బాబర్(అప్పటి కెప్టెన్), హెడ్ కోచ్ (అర్ధర్) తనకు చెప్పారని ట్రైనర్‌ తనతో చెప్పినట్టు హఫీజ్ వెల్లడించాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌తో పనిలేదని ట్రైనర్ చెప్పడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నాడు. ఆ తర్వాత ఆటగాళ్ల బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్‌ను చెక్ చేస్తే అది అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలకు చాలా తక్కువగా వుందని చెప్పాడు. 

మోడర్న్ క్రికెట్‌లో అన్ని జట్లు ఫిట్‌నెస్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని హఫీజ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు కొందరు ఆటగాళ్లు రెండు కిలోమీటర్ల పరుగును కూడా పూర్తిచేయలేకపోయారని ఆరోపించాడు. ఆటగాళ్ల స్కిన్ ఫోల్డ్ (శరీరంలోని కొవ్వు శాతం) సాధారణంగా ఉండాల్సిన స్థాయికి మించి ఒకటిన్నర పాయింట్లు ఎక్కువ ఉందని వివరించాడు. 

హఫీజ్ పాల్గొన్న టీవీషోలోనే ఉన్న పాక్ మాజీ టెస్ట్ కెప్టెన్ అజర్ అలీ మాట్లాడుతూ 2017లో చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లండ్ వెళ్లినప్పుడు ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పాడు. ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైన ఉమర్ అక్మల్‌ను స్వదేశానికి పంపినట్టు గుర్తు చేసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇండియాను ఓడించి పాక్ కప్పు గెలుచుకున్న సమయంలో అర్ధర్ పాక్ హెడ్ కోచ్‌గా ఉన్నాడు. టీ20 క్రికెట్‌లో ఓపెనింగ్ స్లాట్‌ను వదిలిపెట్టి మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాలని బాబర్‌ను ఒప్పించేందుకు తనకు మూడు నెలల సమయం పట్టిందని హఫీజ్ చెప్పుకొచ్చాడు.

More Telugu News