Karnataka Temple Tax: అధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను.. కొత్త బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

Karnataka assembly passes bill imposing tax on temples with over one crore revenue
  • బుధవారం కొత్త ఎండో‌మెంట్స్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్
  • రూ.కోటికి పైబడి ఆదాయం ఉన్న హిందూదేవాలయాలపై 10 శాతం పన్ను
  • కర్ణాటక ప్రభుత్వ విధానాలు హిందూ వ్యతిరేకమంటూ బీజేపీ గుస్సా
  • బీజేపీ హయాంలోనూ దేవాలయాలపై పన్ను విధించేవారన్న కర్ణాటక మంత్రి
అధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను విధించేందుకు ఉద్దేశించిన కొత్త ఎండో‌మెంట్స్ బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం రూ. కోటికి మించి ఆదాయం ఉన్న దేవాలయాలపై ప్రభుత్వం 10 శాతం పన్ను విధిస్తుంది. 

ఈ బిల్లుపై రాష్ట్ర బీజేపీ శాఖ మండిపడింది. కర్ణాటక ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా వసూలు చేసిన నిధులు దుర్వినియోగమవుతాయని కూడా పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం తన ఖాళీ ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కేవలం హిందూ దేవాలయ ఆదాయాలపైనే ప్రభుత్వం ఎందుకు పన్ను విధిస్తోందని ప్రశ్నించారు. 

మరోవైపు, ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి సమర్థించుకున్నారు. ప్రభుత్వం దేవాలయాల సొమ్ము తీసుకోవట్లేదని స్పష్టం చేశారు. ఇలా సేకరించిన మొత్తాన్ని ధార్మిక కార్యక్రమాలకే వినియోగిస్తామని తెలిపారు. పేద అర్చకులకు ఆర్థిక సాయం, చిన్న దేవాలయాలను మెరుగు పరచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బీజేపీ కూడా తన పాలనలో ఇదే పన్ను విధించిందన్నారు. అప్పట్లో బీజేపీ ప్రభుత్వం రూ.5 లక్షలు - రూ.25 లక్షల ఆదాయం ఉన్న దేవాలయాలపై 5 శాతం పన్ను, రూ.25లక్షలు పైబడి ఆదాయం ఉన్న వాటిపై 10 శాతం పన్ను విధించేదన్నారు.
Karnataka Temple Tax
Siddaramaiah
BJP
Congress

More Telugu News