Revanth Reddy: రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారు: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy attends CII Telangana event
  • హైదరాబాదులో సీఐఐ ఆధ్వర్యంలో విద్య-నైపుణ్యాభివృద్ధి సదస్సు
  • ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
  • అభివృద్ధి విషయంలో తాము భేషజాలకు పోమని స్పష్టీకరణ
తెలంగాణలో త్వరలో రూ.2 వేల కోట్ల నిధులతో 64 ఐటీఐలను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ హైదరాబాదులో సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్య-నైపుణ్యాభివృద్ధి అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని తెలిపారు. అభివృద్ధి విషయంలో తాము కూడా భేషజాలకు పోకుండా నిర్మాణాత్మకంగా కృషి చేస్తామని చెప్పారు. 

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయని, ఇప్పుడెవరూ రాజకీయాలు చేయడంలేదని, తమ దృష్టి అంతా అభివృద్ధిపైనే అని అన్నారు. తెలంగాణలో విద్య, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయంలో తాము సీఐఐ భాగస్వామ్యంతో ముందుకెళతామని తెలిపారు. 

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీల స్థాపన కోసం ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నది తమ విధానం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  ఈ ప్రభుత్వం ప్రజలది... ప్రజలు కోరుకుంటేనే మేం వచ్చాం అని ఉద్ఘాటించారు.
Revanth Reddy
CII Telangana
Hyderabad
Congress
Telangana

More Telugu News