Congress: రెండు కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్.. తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

  • రాజ్యసభ సభ్యులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవం
  • మూడు స్థానాలకు ఆరు నామినేషన్ల దాఖలు
  • ముగ్గురిని అనర్హులుగా ప్రకటించిన ఎన్నికల కమిషన్
  • వరుసగా రెండోసారి ఎన్నికైన వద్దిరాజు
Renuka Chowdhury Anil Kumar Yadav and Vaddiraju Elected for Rajya Sabha

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరి, యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఈ మూడు స్థానాలకు మొత్తం ఆరు నామినేషన్లు దాఖలు కాగా, ముగ్గురిని ఎలక్షన్ కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. ఉపసంహరణ గడువు నిన్నటితో ముగియడంతో బరిలో మిగిలిన రేణుకా చౌదరి, అనిల్ కుమార్, రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండింటిని కాంగ్రెస్ దక్కించుకోగా, ఒక స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.  

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమలరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనను రెండోసారి రాజ్యసభకు పంపిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. విభజన హామీలపై పార్లమెంటులో గళమెత్తుతానని, ఖమ్మంలో బీఆర్ఎస్‌కు పునర్వైభవం తీసుకొస్తానని తెలిపారు.

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రం అందుకున్న అనిల్‌కుమార్ యాదవ్ భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి బీసీ బిడ్డను రాజ్యసభకు పంపడం బీసీలకు గర్వకారణమన్నారు. చిన్న వయసులోనే అధిష్ఠానం తనకు పెద్ద పదవి ఇచ్చిందని, ఇది తన జీవితంలోనే గొప్ప సంఘటన అని పేర్కొన్నారు.

More Telugu News