Chalo Delhi march: ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను పునఃప్రారంభించిన రైతులు

Chalo Delhi march restarted by Farmers

  • కేంద్రం ప్రతిపాదించిన ఐదేళ్ల ప్రణాళిక తిరస్కరణ
  • ఎంఎస్‌పీకి చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లకు పరిష్కారం కోరుతూ నిరసనలు పునఃప్రారంభం
  • ఢిల్లీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు

పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధతతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ దేశ రాజధాని దిశగా రైతులు ‘ఛలో ఢిల్లీ మార్చ్’ను పునఃప్రారంభించారు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పరిమిత పంటలను 5 ఏళ్లపాటు కొనుగోలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ముందుగా ప్రకటించినట్టుగా బుధవారం ఉదయం నిరసన మొదలుపెట్టారు. దీంతో ఢిల్లీ చుట్టూ పోలీసులు భద్రత పెంచారు. ఢిల్లీకి వచ్చే ప్రధాన మార్గాలైన ఘాజీపూర్, టిక్రి, నోయిడా, సింగుతో పాటు కీలకమైన సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద మెటల్, సిమెంట్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీలో 144 సెక్షన్ అమల్లో ఉంది. నెల రోజులపాటు ఇది అమల్లో ఉంటుంది. ఇప్పటికే బహిరంగ సభలపై కూడా నిషేధం విధించిన విషయం తెలిసిందే.

అయితే తమ పాదయాత్ర శాంతియుతంగా కొనసాగుతుందని రైతులు చెబుతున్నారు. తమపై బలప్రయోగం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నామని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. కాగా నిరసనకు వచ్చిన రైతులు చాలా రోజులపాటు నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఆహార సామగ్రిని కూడా వారి వెంట తెచ్చుకోవడం గమనార్హం.

కాగా పప్పుధాన్యాలు, మొక్కజొన్నలతో పాటు పత్తి పంటను కనీస మద్దతు ధరతో ఐదేళ్లపాటు కొనుగోలు చేస్తామంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. కొన్ని పంటలను మాత్రమే కొనుగోలు చేస్తే ఎలాగని, మిగతా పంటలు పండించే రైతుల పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు. మొత్తం 23 వాణిజ్య పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఎంఎస్‌పీకి చట్టబద్ధత, చట్టపరమైన హామీల అమలు, రైతు రుణ మాఫీలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, రైతులపై కేసుల ఎత్తివేత సహా పలు డిమాండ్లను రైతులు ప్రభుత్వం ముందు ఉంచారు.

  • Loading...

More Telugu News