Tumor Surgery: అయ్యోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠను చూపిస్తూ.. మెదడులోని కణతిని తొలగించిన గుంటూరు వైద్యులు

Guntur Sri Sai Hospital Successfully Removed Tumor In Brain While Patient Watching Ayodhya Temple Ceremony
  • ఫిట్స్‌తో బాధపడుతున్న మణికంఠ
  • మెదడులోని అత్యంత కీలకప్రాంతంలో 7 సెంటీమీటర్ల కణతిని గుర్తించిన వైద్యులు
  • న్యూరోసర్జన్ హనుమ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆపరేషన్
  • పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స
కుడిచేయి, గొంతు, మాటల తీరును ప్రభావితం చేసే మెదడులోని కీలక ప్రాంతంలో ఉన్న కణతిని తొలగించే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను రోగికి అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ విజయవంతంగా పూర్తిచేశారు. గుంటూరు అరండల్‌పేటలోని శ్రీసాయి ఆసుపత్రి వైద్యులు ఈ మేరకు నిన్న విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

గుంటూరు జిల్లా గొడవర్రుకు చెందిన దానబోయిన మణికంఠ (29) కొంతకాలంగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రుల్లో చూపించుకున్నా ఫలితం లేకపోవడంతో చివరికి శ్రీసాయి ఆసుపత్రిలో చూపించుకున్నారు. పరీక్షలు చేసిన వైద్యులు మెదడులోని అత్యంత కీలక ప్రాంతంలో 7 సెంటీమీటర్ల పరిమాణంలో కణతిని గుర్తించారు. రోగి మెలకువగా ఉండగానే దానిని తొలగించాలని నిర్ణయించారు. ఈ నెల 11న ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు.

మణికంఠకు టీవీలో అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూపిస్తూ విజయవంతంగా కణతిని తొలగించారు. ఆపరేషన్ జరుగుతుండగానే రోగి బాలరాముడికి రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్ కావడంతో నావిగేషన్ వంటి అత్యాధునిక విధానాలను అనుసరించినట్టు న్యూరోసర్జన్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో నిన్న డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు. కాగా, అత్యంత ఖరీదైన ఈ శస్త్రచికిత్సను పూర్తి ఉచితంగా చేసినట్టు తెలిపారు.
Tumor Surgery
Guntur Doctors
Sri Sai Hopital
Ayodhya Ram Mandir

More Telugu News