Russia: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాగ్ ఉన్‌కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

  • కారుని గిఫ్ట్‌గా పంపించిన రష్యా అధ్యక్షుడు
  • రష్యాకి ధన్యవాదాలు తెలిపిన కిమ్ సోదరి కిమ్ యో జోంగ్
  • ఉత్తరకొరియా, రష్యా మధ్య బలపడుతున్న మైత్రి
Russian President Putin a car gift to  North Korean President Kim Jong Un

ఉత్తరకొరియా, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో కిమ్ జాంగ్ ఉన్ రష్యాలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపిన నాటి నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులకు అద్దం పడుతూ కీలక పరిణామం చోటుచేసుకుంది. కిమ్ జాంగ్ ఉన్ వ్యక్తిగత అవసరాల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక కారును బహుమతిగా పంపించారు. రష్యాలో తయారు చేసిన కారును పంపించారని ఉత్తరకొరియా అధికారిక మీడియా మంగళవారం వెల్లడించింది.

ఫిబ్రవరి 18న కారు కిమ్ జాంగ్ ఉన్‌ అత్యున్నత స్థాయి సహాయకులకు అందినట్టు ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్‌ఏ రిపోర్ట్ పేర్కొంది. ఈ సందర్భంగా రష్యాకు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కృతజ్ఞతలు తెలియజేశారని వెల్లడించింది. ఈ కారు గిఫ్ట్ అగ్ర నాయకుల మధ్య ఉన్న ప్రత్యేక వ్యక్తిగత సంబంధాలకు స్పష్టమైన నిదర్శనమని వ్యాఖ్యానించింది. అయితే ఈ కారును ఏవిధంగా ఉత్తరకొరియా తీసుకెళ్లారనేది పేర్కొనలేదు. 

కాగా సెప్టెంబరులో రష్యాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని సందర్శించే సమయంలో అధ్యక్షుడు పుతిన్ వినియోగించే ‘ఆరస్ సెనాట్’ కారును కిమ్  జాంగ్ ఉన్ పరిశీలించారు. వెనుక సీటులో కూర్చోవాలని పుతిన్ కోరినా కిమ్ కూర్చోలేదు. ఉత్తరకొరియా నుంచి ప్రత్యేకంగా తెచ్చుకున్న మేబ్యాక్ కారులోనే ప్రయాణించి అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి చేరుకున్నారు. ఇదిలావుంచితే గతేడాది సెప్టెంబర్‌లో చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం, ఉత్తరకొరియా అణ్వాయుధాల అభివృద్ధిలో సహకారంతో పాటు అన్ని రంగాలలో మార్పిడిని కొనసాగించాలని ఇరుదేశాల అధ్యక్షులు నిర్ణయించిన విషయం తెలిసిందే.

More Telugu News