Supreme Court: మహిళా శక్తి గురించి మాట్లాడుతుంటారు కదా.. ఇక్కడ చూపించండి: కేంద్రానికి సీజేఐ సూచన

You Speak Of Women Power and Show It Here says Supreme court Chief Justice To Central Govt
  • కోస్ట్‌గార్డ్స్‌లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్ట్
  • దేశ సరిహద్దులను సంరక్షిస్తున్న నారీమణులు తీర ప్రాంతాన్ని రక్షించలేరా అని ప్రశ్న
  • శారీరక పరిమితులు అంటూ ప్రభుత్వం చేసిన వాదనలపై ఏకీభవించని త్రిసభ్య ధర్మాసనం
కోస్ట్‌గార్డ్‌లో పురుషులకు సమానంగా మహిళలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటుకు విముఖత వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్మీ, నేవీలో ఇప్పటికే ఈ విధానం ఉండగా కోస్ట్‌గార్డ్స్ విషయంలో ఎందుకు విభిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. దేశ సరిహద్దులను సంరక్షిస్తున్న నారీమణులు తీరప్రాంతాలను కాపాడలేరా? అని సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రాన్ని నిలదీసింది. నారీ శక్తి గురించి మాట్లాడే ప్రభుత్వం తన నిబద్ధతను ఈ విషయంలో చాటుకోవాలని సూచించింది. కోస్ట్‌గార్డ్‌లో మహిళలు పనిచేసే విషయంలో పితృస్వామ్యం విధానంలో ఎందుకు ఆలోచిస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. 

ఆర్మీ, నేవీల మాదిరిగా కాకుండా తీర రక్షక దళంలో (కోస్ట్‌గార్డ్) ప్రత్యేక పరిస్థితులు ఉంటాయంటూ ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీ వాదనలు వినిపించారు. అయితే న్యాయవాది వాదనలను సీజే డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. మహిళలు కోస్ట్‌గార్డ్‌లో పనిచేయలేరని చెప్పే రోజులకు కాలం చెల్లిపోయిందని బెంచ్ వ్యాఖ్యానించింది. సరిహద్దులను రక్షించగలిగితే తీర ప్రాంతాలను కూడా రక్షించగలరని వ్యాఖ్యానించింది. శారీరక పరిమితులు, సామాజిక నిబంధనలు అంటూ ప్రభుత్వం చేసిన వాదనలను సుప్రీంకోర్ట్ తిరస్కరించింది. ఇది లింగ సమానత్వ భావనకు విరుద్ధమని, లింగ పక్షపాతాన్ని చూపుతోందని వ్యాఖ్యానించింది.

కోస్ట్‌గార్డులో పురుషులతో సమానంగా మహిళలకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ కోస్ట్‌గార్డ్ షార్ట్ సర్వీస్ అపాయింట్‌మెంట్ ఆఫీసర్ ప్రియాంక త్యాగి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది. కోస్ట్‌గార్డ్ మొట్టమొదటి సంపూర్ణ మహిళా బృందంలో త్యాగి పనిచేశారు. కోస్ట్‌గార్డ్ ఫోర్స్‌లోని డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఫ్లీట్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అయితే కోస్ట్‌గార్డు శాశ్వత కమిషన్‌లోకి తన పేరుని పరిగణనలోకి తీసుకోకపోవడంతో కోస్ట్‌గార్డ్స్ నుంచి ఆమె రిలీజ్ కావాల్సి వచ్చింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టులో కూడా ఆమె తాత్కాలిక ఉపశమనం లభించలేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. త్యాగి తరపున సీనియర్ న్యాయవాది అర్చన పాఠక్ దవే వాదనలు వినిపించారు. ఆర్మీ మాదిరిగానే కోస్ట్‌గార్డ్స్‌లోనూ మహిళా సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని, కమీషన్డ్ ఆఫీసర్లుగా అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. కాగా ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాలని 2020లో సుప్రీంకోర్ట్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
Supreme Court
Coast Guard
DY Chandrachud
Army
Navy
Central Government

More Telugu News