Navalny: నావల్నీ మృతదేహంపై గాయాల గుర్తులు?

  • ఛాతిపై గాయాల చిహ్నాలు ఉన్నాయన్న వైద్య సిబ్బంది
  • బలవంతంగా అదుపులోకి తీసుకున్నప్పుడు ఏర్పడే గుర్తులేనని వెల్లడి
  • డెడ్ బాడీని క్లినికల్ హాస్పిటల్ కు తరలించడంపై అనుమానాలు
Signs Of Bruises Found On Navalnys Dead Body

రష్యా జైలులో మరణించిన అలెక్సీ నావల్నీ మృతదేహం ఎక్కడుందనే ప్రశ్నకు సమాధానం దొరికింది. రెండు రోజుల పాటు కొనసాగిన హైడ్రామా సోమవారం వీడింది. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీ జైలుకు దగ్గర్లోని టౌన్ ఆసుపత్రి మార్చురీలో నావల్నీ డెడ్ బాడీ ఉందని అధికారులు వెల్లడించారు. అయితే, నావల్నీ మృతదేహాన్ని ఇప్పుడే ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించబోమని స్పష్టం చేశారు. నావల్నీ మరణానికి కారణం ఏంటనేది ప్రాథమిక పరీక్షలలో వెల్లడి కాలేదని, పూర్తిస్థాయిలో మరోమారు పోస్ట్ మార్టం నిర్వహించి కారణాన్ని గుర్తించాల్సి ఉందని చెప్పారు. ఆ తర్వాతే డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని వెల్లడించారు.

నావల్నీ డెడ్ బాడీని పరీక్షించిన వైద్య సిబ్బంది.. ఆయన మృతదేహంపై గాయాల గుర్తులు ఉన్నాయని చెప్పారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని సిబ్బంది ఒకరు ఈ విషయాన్ని లీక్ చేశారు. డెడ్ బాడీ ఛాతీపైనా గాయాలైనట్లు కనిపించిందన్నారు. పోలీసులు ఓ వ్యక్తిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నపుడు ఏర్పడే గాయాల మాదిరిగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో నావల్నీ మరణంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వమే నావల్నీని చంపించిందని, ఆధారాలను మాయం చేసేందుకే మృతదేహాన్ని అప్పగించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా జైలులో ఖైదీలు ఎవరైనా మరణిస్తే అధికారులు ఆ డెడ్ బాడీని ఫారెన్ మెడిసిన్ బ్యూరోకు తరలిస్తారని, నావల్నీ డెడ్ బాడీని మాత్రం దగ్గర్లోని క్లినికల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. దీనిపై వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ క్లినిక్ లో ఏం జరిగిందనేది తేలాలని, నావల్నీ మృతదేహం చుట్టూ నెలకొన్న మిస్టరీని ఛేదించాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News