నావల్నీ మృతదేహంపై గాయాల గుర్తులు?
- ఛాతిపై గాయాల చిహ్నాలు ఉన్నాయన్న వైద్య సిబ్బంది
- బలవంతంగా అదుపులోకి తీసుకున్నప్పుడు ఏర్పడే గుర్తులేనని వెల్లడి
- డెడ్ బాడీని క్లినికల్ హాస్పిటల్ కు తరలించడంపై అనుమానాలు
నావల్నీ డెడ్ బాడీని పరీక్షించిన వైద్య సిబ్బంది.. ఆయన మృతదేహంపై గాయాల గుర్తులు ఉన్నాయని చెప్పారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని సిబ్బంది ఒకరు ఈ విషయాన్ని లీక్ చేశారు. డెడ్ బాడీ ఛాతీపైనా గాయాలైనట్లు కనిపించిందన్నారు. పోలీసులు ఓ వ్యక్తిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నపుడు ఏర్పడే గాయాల మాదిరిగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో నావల్నీ మరణంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వమే నావల్నీని చంపించిందని, ఆధారాలను మాయం చేసేందుకే మృతదేహాన్ని అప్పగించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా జైలులో ఖైదీలు ఎవరైనా మరణిస్తే అధికారులు ఆ డెడ్ బాడీని ఫారెన్ మెడిసిన్ బ్యూరోకు తరలిస్తారని, నావల్నీ డెడ్ బాడీని మాత్రం దగ్గర్లోని క్లినికల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. దీనిపై వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ క్లినిక్ లో ఏం జరిగిందనేది తేలాలని, నావల్నీ మృతదేహం చుట్టూ నెలకొన్న మిస్టరీని ఛేదించాలని డిమాండ్ చేస్తున్నారు.