Farmers: రాత్రి ఒంటి గంట వరకు రైతులతో కేంద్ర మంత్రుల చర్చలు.. ఐదేళ్లపాటు కొంటామని ప్రతిపాదన!

  • రైతులు అంగీకరిస్తే ఐదేళ్లపాటు ప్రభుత్వ ఏజెన్సీలతో కనీస మద్దతు ధరలతో పంటలు కొంటామని కేంద్ర మంత్రుల బృందం ప్రతిపాదన
  • రైతు చర్చా వేదికల్లో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామన్న రైతు సంఘాల నాయకులు
  • ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ తాత్కాలికంగా నిలిపివేత.. సమస్యలు పరిష్కరించకపోతే తిరిగి 21న ప్రారంభిస్తామని హెచ్చరిక
Central Minister Piyush Goyal this is Said after 4th Round Of Meeting With Farmers

పంజాబ్-హర్యానా సరిహద్దులో వేలాది మంది రైతుల నిరసనలు కొనసాగుతుండగా ఆదివారం రాత్రి ఒంటి గంట వరకు రైతు సంఘాల నేతలు, కేంద్ర మంత్రుల బృందం మధ్య కీలకమైన నాలుగవ రౌండ్ చర్చలు జరిగాయి. ఢిల్లీలోని మహాత్మా గాంధీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ భవనంలో ఆదివారం రాత్రి 8.15 గంటలకు మొదలైన చర్చలు అర్ధరాత్రి ఒంటి గంటకు ముగిశాయి. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్యం-పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, రైతు సంఘాల నేతలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు మరోసారి పట్టుబట్టారు. ఈ చర్చలకు సంబంధించిన విషయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మీడియాకు వెల్లడించారు.

రైతులు అంగీకరిస్తే ఒప్పందం కుదుర్చుకుని ఐదేళ్లపాటు కనీస మద్దతు ధరలతో ప్రభుత్వ ఏజెన్సీలే పంటలను కొనుగోలు చేస్తాయని హామీ ఇచ్చామని పీయూష్ గోయెల్ చెప్పారు. పప్పులు, మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధరతో ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేస్తాయని కేంద్ర మంత్రుల కమిటీ ప్రతిపాదన చేసిందని వివరించారు. కొనుగోలు చేసే పరిమాణంపై ఎలాంటి పరిమితి ఉండబోదని అన్నారు. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి సహకార సంఘాలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయని వివరించారు. వచ్చే ఐదేళ్లపాటు ఈ పద్దతిలో కొంటామని హామీ ఇచ్చామని వెల్లడించారు. ఇందుకోసం ఒక వెబ్‌సైట్ రూపొందిస్తామని పీయూష్ గోయెల్ చెప్పారు.

అయితే ప్రభుత్వ ప్రతిపాదనపై రైతుల చర్చా వేదికల్లో చర్చించి రెండు రోజుల్లో తమ నిర్ణయాన్ని చెబుతామని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వానికి చెప్పారు. ఫిబ్రవరి 19-20 తేదీల్లో చర్చించి, నిపుణుల అభిప్రాయం తీసుకుని తదనుగుణంగా తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని కేంద్రం ప్రతిపాదనపై రైతు సంఘాల నాయకుడు సర్వన్‌సింగ్‌ పంధేర్‌ అన్నారు. రైతు రుణమాఫీ, ఇతర డిమాండ్లపై సంప్రదింపులు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే రెండు రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారమవుతాయని తాము ఆశిస్తున్నామని అన్నారు. ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని, సమస్యలన్నీ పరిష్కరించకపోతే ఫిబ్రవరి 21 ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభిస్తామని పంధేర్‌ స్పష్టం చేశారు. కాగా అంతకు ముందు ఫిబ్రవరి 8, 12, 15 తేదీల్లో కేంద్రమంత్రులు, రైతు నేతల మధ్య జరిగిన చర్చలు కొలిక్కిరాని విషయం తెలిసిందే.

More Telugu News