YS Jagan: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతుండాలి... సైకిల్ ఇంటి బయట ఉండాలి... తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలి: సీఎం జగన్

  • ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ
  • విపక్షాలపై ధ్వజమెత్తిన సీఎం జగన్
  • విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ వ్యాఖ్యలు
  • మరోసారి తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్న సీఎం జగన్
  • టీడీపీని కౌరవసేనతో పోల్చిన వైనం
CM Jagan interesting comments on opposition parties

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు హాజరైన సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతుండాలని, సైకిల్ ఇంటి బయట ఉండాలని, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలని తనదైన శైలిలో పేర్కొన్నారు. ఇది విశ్వసనీయతకు, మోసకారితనానికి మధ్య జరుగుతున్న యుద్ధం... ఇది రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం అని అభివర్ణించారు. కౌరవసేన వంటి టీడీపీ కూటమికి ఎదురుగా వెళుతున్నది అభిమన్యుడు కాదు... గాండీవి అర్జునుడు అని సీఎం జగన్ స్పష్టం చేశారు. తన వెనుక శ్రీకృష్ణుడిలా ప్రజలు ఉన్నారని తెలిపారు. రాయలసీమకు సముద్రం లేకపోవచ్చు కానీ, ఇవాళ రాప్తాడులో జనసముద్రం కనిపిస్తోందని చమత్కరించారు. 

చంద్రబాబుకు ఇదే నా సవాల్

ఈ గడ్డపై మమకారంతో నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను. కానీ వేరే రాష్ట్రంలో ఉంటూ ప్రజలను మోసం చేసేందుకు అప్పుడప్పుడు వచ్చే వారితో నేను యుద్ధం చేస్తున్నాను. ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. 

ఈ సభా ముఖంగా చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు... మూడు పర్యాయాలు సీఎం పీఠం ఎక్కారు... మరి చంద్రబాబు పేరు చెబితే రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా చెప్పగలరా? చంద్రబాబు పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా? బడికి వెళ్లే పిల్లలకు, కాలేజీకి వెళ్లే పిల్లలకు గుర్తుకు వచ్చే పథకం ఏమైనా ఉందా? అని అడుగుతున్నా. ఆయన ఏదైనా మంచి పని చేస్తే కదా గుర్తుకురావడానికి! 

చంద్రబాబు మార్కు చూద్దామన్నా కనిపించదు

అయ్యా చంద్రబాబూ... ఓ ఊరి మధ్యలోనైనా నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ ఒక్కటైనా కనిపిస్తుందేమో చూడండి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు బాబు మార్కు ఎక్కడైనా కనిపిస్తుందా? 

టీడీపీ మూడు సార్లు అధికారంలోకి వచ్చింది... చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతి సందర్భంలోనూ మేనిఫెస్టో పేరిట వంచన చేశారు. ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదు. ప్రజలు అన్నీ మర్చిపోయి మళ్లీ తనకు ఓటేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. కలర్ ఫుల్ మేనిఫెస్టోతో, ఆరు స్కీములు పేరిట ప్రజలకు ఎర వేస్తున్నాడు... అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు.

More Telugu News