Chandrababu: ఈ ప్రశ్నలకు సభలో సమాధానం చెబుతావా జగన్?: చంద్రబాబు

  • ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సభ
  • జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని రాప్తాడు అడుగుతోందన్న చంద్రబాబు
  • కియా అనుబంధ పరిశ్రమలు ఏవని అనంత అడుగుతోందని వెల్లడి
  • డ్రిప్ పథకాలు ఏవని సీమ రైతన్న అడుగుతున్నాడంటూ చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు
Chandrababu shot questions to CM Jagan

సీఎం జగన్ ఇవాళ ఉమ్మడి అనంతపురం రాప్తాడులో సిద్ధం సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ కు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. 

రాప్తాడు అడుగుతోంది... జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది... కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? సీమ రైతన్న అడుగుతున్నాడు... నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని? సమాధానం చెప్పి సభ పెడతావా... సభలో సమాధానం చెబుతావా? అంటూ చంద్రబాబు నిలదీశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

అంతేకాదు, నాడు జాకీ పరిశ్రమ వెళ్లిపోవడానికి దారితీసిన పరిణామాలను కూడా చంద్రబాబు వివరించారు. "ఏపీలో జాకీ అండర్ వేర్ పరిశ్రమ పెట్టేందుకు దాని మాతృసంస్థ పేజ్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 2017లో పేజ్ ఇండస్ట్రీస్ కు ఏపీఐఐసీ ద్వారా అనంతపురం జిల్లా రాప్తాడులో అప్పటి ఏపీ ప్రభుత్వం 27 ఎకరాల భూమి కేటాయించింది. 

భూకేటాయింపుల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే సమయంలోనే ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారింది. అయితే, రూ.129 కోట్ల విలువైన ఆ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పేజ్ ఇండస్ట్రీస్ కు ఓ స్థానిక ప్రజాప్రతినిధి రూపంలో అవాంతరాలు ఎదురయ్యాయి. 

అతడు ఎన్నికల్లో గెలవడానికి అయిన ఖర్చులో సగం రూ.20 కోట్లు ఇవ్వాలని ఆ సంస్థను డిమాండ్ చేశాడు. అంతేకాదు, తన సన్నిహితులకే సబ్ కాంట్రాక్టులు ఇవ్వాలని, తాను సిఫారసు చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని పేజ్ ఇండస్ట్రీస్ పై ఒత్తిడి తెచ్చాడు. తన మాట వినకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. 

దాంతో హడలిపోయిన పేజ్ ఇండస్ట్రీస్ సంస్థ స్థానిక ప్రజాప్రతినిధి గురించి ప్రభుత్వ పెద్దలతో మొరపెట్టుకుంది. ఆ ప్రయత్నాలు కూడా ఫలించకపోగా, సమస్యలు రెట్టింపయ్యాయి. 

ఈ నేపథ్యంలో, 2019 డిసెంబరు 3న పేజ్ ఇండస్ట్రీస్ సంస్థ రాష్ట్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి మురుగేశన్ కు రహస్యంగా ఓ లేఖ రాసింది. తమ పెట్టుబడి ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నామని, తమకు కేటాయించిన భూమిని వెనక్కి ఇచ్చేస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది" అంటూ చంద్రబాబు వివరించారు.

More Telugu News