Yashasvi Jaiswal: వరుసగా రెండు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన జైస్వాల్... ఇంగ్లండ్ ముందు దిమ్మదిరిగే టార్గెట్

Yashasvi Jaiswal smashes second double century in this series
  • టీమిండియా-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు
  • 236 బంతుల్లో 214 పరుగులు చేసిన జైస్వాల్
  • 14 ఫోర్లు, 12 సిక్సులతో విధ్వంసం
  • వరుసగా రెండో అర్ధసెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్
  • అల్లాడిపోయిన ఇంగ్లండ్ బౌలర్లు
రాజ్ కోట్ టెస్టులోనూ టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాట్ కు ఎదురులేకుండా పోయింది. ఇంగ్లండ్ ను బౌలర్లను తుక్కు తుక్కుగా కొట్టిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ సిరీస్ లో రెండో డబుల్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. 

విశాఖ టెస్టులోనూ డబుల్ సెంచరీతో అలరించిన ఈ డాషింగ్ బ్యాట్స్ మన్, రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో టెస్టులోనూ విరుచుకుపడ్డాడు. 236 బంతుల్లో 214 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జైస్వాల్ స్కోరులో 14 ఫోర్లు, 12 సిక్సులు ఉన్నాయంటే ఇంగ్లండ్ బౌలర్లను ఎలా ఉతికారేశాడో అర్థం చేసుకోవచ్చు. 

ఈ సందర్భంగా యువ జైస్వాల్ ఒక రికార్డు కూడా నమోదు చేశాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా పాకిస్థాన్ దిగ్గజం వసీమ్ అక్రమ్ రికార్డును సమం చేశాడు. అక్రమ్ 1996లో జింబాబ్వేపై ఆడుతూ ఓ టెస్టు ఇన్నింగ్స్ లో 12 సిక్సర్లు బాదాడు. 

ఇక, మ్యాచ్ విషయానికొస్తే... టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 4 వికెట్లకు 430 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా ఇంగ్లండ్ ముందు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 

టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో లంచ్ తర్వాత సెషన్ లో సర్ఫరాజ్ ఖాన్ కూడా మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న సర్ఫరాజ్ మొదటి ఇన్నింగ్స్ లో మాదిరే రెండో ఇన్నింగ్స్ లోనూ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. 72 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సర్ఫరాజ్ తొలి ఇన్నింగ్స్ లో కూడా అర్ధసెంచరీ చేయడం తెలిసిందే. 

అంతకుముందు, శుభ్ మాన్ గిల్ 91 పరుగుల వద్ద రనౌటై నిరాశగా పెవిలియన్ చేరాడు. నిన్న నైట్ వాచ్ మన్ గా బరిలో దిగిన కుల్దీప్ యాదవ్ 3 ఫోర్లు, 1 సిక్సుతో 27 పరుగులు చేయడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్ 1, టామ్ హార్ట్ లే 1, రెహాన్ అహ్మద్ 1 వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 319 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో టీమిండియాకు 126 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
Yashasvi Jaiswal
Double Century
Team India
England
3rd Test
Rajkot

More Telugu News