Suhani Bhatnagar: ‘దంగల్’ సినిమా బాల నటి మృతి పై తండ్రి తీవ్ర ఆవేదన

  • అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధి ‘డెర్మటోమయోసిటిస్’తో మృతి
  • ఫిబ్రవరి 16న చనిపోయిందని ప్రకటించిన తండ్రి
  • స్టెరాయిడ్ల ద్వారా చికిత్స అందించడంతో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడిందని వెల్లడి
Suhani Bhatnagar who impressed as a child actress in the movie Dangal has passed away

అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన 'దంగల్' సినిమాలో బబితా కుమారి ఫోగట్ పాత్రలో బాల నటిగా మెప్పించిన సుహానీ భట్నాగర్ చనిపోయింది. అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధి ‘డెర్మటోమయోసిటిస్’తో ఫిబ్రవరి 16న ఆమె ఢిల్లీలో మృతి చెందింది. కేవలం 19 ఏళ్ల వయసులో చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దంగల్ చిత్ర బృందం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది.

తన కూతురికి వచ్చిన వ్యాధిపై సుహాని తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ రెండు నెలల క్రితం సుహాని ఒక చేతిలో వాపు వచ్చింది. సాధారణమైన వాపుగా భావించాం. తర్వాత మరొక చెయ్యి కూడా వాచింది. ఆ తర్వాత క్రమంగా శరీరమంతా వ్యాపించింది. చాలా మంది వైద్యులను సంప్రదించినప్పటికీ ఆమె అనారోగ్య సమస్యను గుర్తించలేకపోయారు. 11 రోజుల క్రితం సుహానిని ఢిల్లీలోని ఎయిమ్స్‌ హాస్పిటల్‌లో చేర్పించాం. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు అరుదైన ‘డెర్మటోమయోసిటిస్’ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధికి స్టెరాయిడ్స్ మాత్రమే చికిత్స. అయితే స్టెరాయిడ్స్ తీసుకున్న తర్వాత ఆమె శరీరంలో రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. రోగనిరోధక శక్తి  మొత్తం బలహీనపడింది. ఆస్పత్రిలోనే ఇన్‌ఫెక్షన్‌‌కు గురైంది. ఆమె ఊపిరితిత్తులు బలహీనపడ్డాయి. ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఫిబ్రవరి 16 సాయంత్రం సుహాని ప్రాణాలు విడిచింది’’ అని సుహాని తండ్రి కన్నీరు చమర్చారు.

సుహాని తల్లి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సుహాని చిన్నప్పటి నుంచి మోడలింగ్‌ చేసేదని, సుమారు 25,000 మంది పిల్లలు పోటీ పడగా 'దంగల్' సినిమా నటించే అవకాశం సుహానికి దక్కిందని గుర్తుచేసుకుంది. సుహాని ప్రస్తుతం మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో కోర్సు చేస్తోందని, రెండవ సంవత్సరం చదువుతుండగా ఈ విషాదం జరిగిందని వాపోయింది. కాగా సుహాని మరణవార్త వినడం చాలా బాధ కలిగిస్తోందని అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతర నటీనటులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ నివాళులు అర్పిస్తూ పోస్టులు పెట్టారు.

More Telugu News