Sanjay Manjreka: ‘ఇది వ్యూహాత్మక తప్పిదం’.. కెప్టెన్ రోహిత్ శర్మపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ స్టార్ ఆటగాడు

  • డకెట్ దూకుడుగా ఆడుతున్నప్పుడు అశ్విన్‌ను బౌలింగ్‌కు దించకపోవడంపై ప్రశ్నించిన సంజయ్ మంజ్రేకర్
  • అశ్విన్‌ను ఆలస్యంగా బౌలింగ్ చేయించడం వ్యూహాత్మక తప్పిదంగా అభివర్ణించిన మాజీ ఆటగాడు
  • స్పిన్‌పై ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతున్నప్పుడు అశ్విన్ సరైన సమాధానమని అభిప్రాయం
Ex India Star Sanjay Manjrekar Questions Rohit Sharmas Captaincy With Ashwin Reference

రాజ్‌కోట్‌ టెస్టులో పర్యాటక ఇంగ్లండ్‌ జట్టుపై భారత్ పట్టు సాధించింది. అయితే రెండో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శుక్రవారం ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలను 4వ, 5వ బౌలర్లుగా బౌలింగ్ చేయించడాన్ని ప్రశ్నించాడు. ఓపెనర్ బెన్‌డకెట్ వేగంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ చక్కని ఆరంభాన్ని అందుకుంది. కేవలం 39 బంతుల్లో డకెట్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో స్పిన్నర్ అశ్విన్‌‌కు కెప్టెన్ రోహిత్ శర్మ బంతి అందించాడు. చక్కగా బౌలింగ్ చేసిన అశ్విన్ తన రెండో ఓవర్‌లో ఓపెన్ జాక్ క్రాలే వికెట్‌ను తీశాడు. దూకుడు మీద ఉన్న డకెట్ వికెట్ తీయకపోయినప్పటికీ.. అతడు క్రీజులో సెట్ కాకముందే అతడికి బౌలింగ్ వేయాలనుకున్నానని మ్యాచ్ అనంతరం అశ్విన్ చెప్పాడు.

అశ్విన్ కంటే ముందుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేసినప్పటికీ అతడి బౌలింగ్‌లో డకెట్‌ సునాయాసంగా పరుగులు రాబట్టాడు. స్వీప్, రివర్స్ స్వీప్ సహా మైదానం నలువైపులా షాట్లు ఆడాడు. అయితే ఈ విధంగా అశ్విన్ కంటే ముందుగా కుల్దీప్ యాదవ్‌ను బౌలింగ్ చేయించడంపై రోహిత్ శర్మను సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నించాడు. ఇది వ్యూహాత్మక తప్పిదమని, నిర్ణయ లోపమని విమర్శించాడు.

‘‘నాకు రోహిత్ శర్మ ఎత్తుగడ అర్థం కాలేదు. తప్పిదంగా భావిస్తున్నాను. అదొక వ్యూహాత్మక తప్పిదం. డకెట్ వ్యక్తిగత స్కోరు 72 పరుగుల వద్ద అశ్విన్ తొలి బంతి వేశాడు. స్పిన్ బౌలింగ్‌పై దూకుడుగా ఆడాలన్న ఇంగ్లండ్ టీమ్‌ వ్యూహానికి అశ్విన్ ఒక్కడే సరైన సమాధానం. చక్కగా బౌలింగ్ చేయగలడు. అందుకే స్పిన్నర్లలో మొదటి ఆప్షన్‌గా ఉండాలి. కానీ కీలకమైన ఆ దశలో కుల్దీప్ యాదవ్‌ను దించడం నాకు అర్థం కాలేదు. చక్కటి పేస్ బౌలింగ్ ఉన్నప్పటికీ ఉపయోగించుకోలేదు’’ అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఇంగ్లండ్‌ దూకుడుగా క్రికెట్ ఆడేటప్పుడు కెప్టెన్ రోహిత్‌ శర్మ అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. ఈఎస్పీఎన్‌క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

More Telugu News