Chandrababu: ఇప్పుడు ఏపీకి నాలుగో రాజధాని వచ్చింది: చంద్రబాబు

Chandrababu says AP got fourth capital
  • పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో రా కదలిరా సభ
  • వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్న బాబు 
  • జగన్ కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డారని వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఏర్పాటు చేసిన రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని జగన్ చెప్పాడా, లేదా? అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అన్నాడా లేదా? అని ప్రశ్నించారు. గెలిచాక ఎందుకు మాట మార్చావ్? అని నిలదీశారు. 

"ఆ తర్వాత మూడు రాజధానులు అన్నాడు... ఇప్పుడు మళ్లీ  హైదరాబాద్ ను నాలుగో రాజధాని అంటున్నాడు అని ఎద్దేవా చేశారు. బిచ్చమెత్తుకుంటే ఎవరైనా ఆస్తిలో వాటా ఇస్తారా? హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. మేం నష్టపోయాం, మేం చేతకాని వాళ్లం. పనికిరానివాడు ముఖ్యమంత్రి అయ్యాడు. మేం మళ్లీ వస్తాం... ఓ పక్కన ఉంటాం అంటే ఒప్పుకుంటారా?" అని ప్రశ్నించారు. 

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. మరో 52 రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే ఏం జరుగుతుందో ఆలోచించి మరీ ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటం మా కోసం కాదు... మీ పిల్లల భవిష్యత్  కోసం... ఓటేసే ముందు ప్రతి విషయంపై మనసు పెట్టి ఆలోచించాలని సూచించారు. ఎన్నికల ముందే తమ విజయం ఖాయమైందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

వైనాట్ పులివెందుల అనేదే తమ నినాదం అని పేర్కొన్నారు. జగన్ కు అభ్యర్థులు దొరక్క దిక్కుతోచని స్థితిలో పడ్డారని చంద్రబాబాబు ఎద్దేవా చేశారు. జగన్... రాజకీయాలను కలుషితం చేశారని విమర్శించారు. చిల్లర రాజకీయాలు వద్దు... గౌరవప్రదమైన రాజకీయాలు చేయడం నేర్చుకో అని హితవు పలికారు. 

పోలీసుల అండతో అక్రమ మైనింగ్ చేపడుతున్నారని... ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ పైనా కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనలో తాను, పవన్ కల్యాణ్ సహా అందరం బాధితులమేనని అన్నారు. దోపిడీకి అడ్డం వచ్చిన వారిపై కేసులు, వేధింపులు పెరిగాయని తెలిపారు.

  • Loading...

More Telugu News