Komatireddy Venkat Reddy: పాపాల భైరవుడు కేసీఆర్ ను అసెంబ్లీకి పిలవండి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • మొహం చెల్లక కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్న కోమటిరెడ్డి
  • నల్గొండకు వెళ్లిన కేసీఆర్ అసెంబ్లీకి రాలేరా అని మండిపాటు
  • తనను, సీఎంను అరే తురే అంటున్నాడని ఆగ్రహం
Call KCR to Assembly says Komatireddy Venkat Reddy

తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టింది. శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతుండగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్పించుకుని... పాపాల భైరవుడు కేసీఆర్ ను అసెంబ్లీకి పిలవాలని కోరారు. మొహం చెల్లక ఆయన శాసనసభకు రావడం లేదని విమర్శించారు. సభకు కేసీఆర్ వచ్చిన తర్వాతే నీటి రంగంపై చర్చను కొనసాగించాలని అన్నారు. హెలికాప్టర్ లో నల్గొండకు వెళ్లిన కేసీఆర్... అసెంబ్లీకి రాలేరా? అని ప్రశ్నించారు. 

నల్గొండను నాశనం చేసిందే కేసీఆర్ అని కోమటిరెడ్డి మండిపడ్డారు. తమపై కేసీఆర్ వాడిన భాష దారుణంగా ఉందని... తనను, సీఎంను అరే తురే అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రతిపక్ష నేత గురించి మాట్లాడిన మాటలు దారుణంగా ఉన్నాయని... ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు... కేసీఆర్ ను కాల్చేయాలని, ఉరితీయాలని అన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని విమర్శించారు.

More Telugu News