Padi Kaushik Reddy: ఓటుకు నోటు కేసులో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయం: పాడి కౌశిక్ రెడ్డి

  • ఓటుకు నోటు కేసు ట్రయల్ పూర్తయింది... రేవంత్ రెడ్డికి శిక్ష ఖాయమని జోస్యం
  • కేసీఆర్‌పై, బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్లు పూర్తి చేసుకోవాలని బీఆర్‌ఎస్ కోరుకుంటోందని వ్యాఖ్య
padi kaushik reddy says revanth reddy will arrest soon

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసు ట్రయల్ పూర్తయిందని... మరో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష పడడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్‌పైనా, బీఆర్ఎస్‌పైనా రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని... ఇది దురదృష్టకరమన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లుగా కాంగ్రెస్ చెప్పుకోవడం సరికాదన్నారు. అసలు కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది? ఎప్పుడు భర్తీ చేసింది? అని నిలదీశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్లు పూర్తి చేసుకోవాలని బీఆర్‌ఎస్ కోరుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి రివర్స్ అయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండే అయ్యేది రేవంత్ రెడ్డే అన్నారు. నిత్యం అబద్దాలు చెప్పడమే పనిగా పెట్టుకున్న వారిని పాథలాజికల్ లయ్యర్ అంటారని... రేవంత్ రెడ్డి అదే కేటగిరీ కిందకు వస్తారన్నారు. హరీశ్ రావుపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

More Telugu News