Nitish Kumar: నితీశ్ కుమార్ వస్తే చూద్దాం... ఆయన కోసం తలుపులు తెరిచే ఉన్నాయి: లాలూ ప్రసాద్ యాదవ్

  • లాలూ ప్రసాద్ వ్యాఖ్యలతో ఊహాగానాలు... తెరదించిన జేడీయూ నేత
  • లాలూ ప్రసాద్ చెప్పినట్లుగా ఆర్జేడీతో కలిసి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టీకరణ
  • నితీశ్ కుమార్‌పై లాలూ ప్రసాద్ తనయుడి విమర్శలు
Lalu Prasad says doors are always open for nitish kumar

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తిరిగి మహాకూటమిలోకి వస్తే పరిశీలిస్తామని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ వస్తే స్వాగతిస్తారా? అని మీడియా ప్రశ్నించింది. ఆయన తిరిగి వస్తే అప్పుడు చూద్దాం... ఆయన కోసం తలుపులు తెరిచే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

నితీశ్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు వెళ్లిన తర్వాత నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ అంశంపై మాట్లాడలేదు. అయితే ఈ రోజు ఆ పార్టీ నేతలు మనోజ్ ఝా, సంజయ్ యాదవ్‌ల రాజ్యసభ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి లాలూ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీశ్, లాలూ ప్రసాద్ ఎదురుపడ్డారు. ఈ సమయంలో లాలూ ప్రసాద్‌ను మీడియా ప్రశ్నించింది. మాజీ మిత్రుడి కోసం తలుపు తెరిచే ఉందా? అని మీడియా అడగగా... ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని లాలూ సమాధానం ఇచ్చారు.

ఊహాగానాలకు తెరదించిన జేడీయూ నేత

అయితే ఈ ఊహాగానాలకు జేడీయూ ముఖ్య అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ మాత్రం తెరదించే ప్రయత్నాలు చేశారు. తమకు తలుపులు తెరిచే ఉన్నాయని లాలూ ప్రసాద్ చెప్పారు... కానీ ఆర్జేడీతో అధికారం పంచుకున్నప్పుడల్లా ఆ పార్టీ అవినీతికి పాల్పడిందని తమ నాయకుడు నితీశ్ కుమార్ చెప్పారని గుర్తు చేశారు. కాబట్టి మళ్లీ వారి వద్దకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.

నితీశ్ కుమార్‌పై లాలూ ప్రసాద్ తనయుడి విమర్శలు

లాలూ ప్రసాద్ తనయుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ శుక్రవారం రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్‌పై నిప్పులు చెరిగారు. మన ముఖ్యమంత్రి ఎలా ఉంటారో మనందరికీ తెలుసు... ఆయన ఎవరి మాటా వినరు... చనిపోతాను కానీ బీజేపీతో జత కలవనని పలుమార్లు చెప్పారు.. కానీ ఇప్పుడు అదే పార్టీతో కలిశారని మండిపడ్డారు. 2024లో బీజేపీని ఓడించేందుకు ఎంతో త్యాగం చేశామని.. అందుకే నితీశ్‌ను ముఖ్యమంత్రిగా చేశామన్నారు.

More Telugu News