Bonda Uma: జగన్ వ్యాఖ్యలు, సాక్షి కథనంతో వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి: బొండా ఉమా

  • వాలంటీర్లు వైసీపీ సైన్యం అని నిన్న చెప్పిన జగన్
  • వాలంటీర్లకు రూ. 9,663 కోట్లను జగన్ దోచి పెట్టారన్న ఉమా
  • ప్రజల సొమ్ముతో వైసీపీ కోసం వాలంటీర్లతో పని చేయించుకుంటున్నారని విమర్శ
Volunteers life came to roads with Jagan comments says Bonda Uma

వాలంటీర్లే తన సైన్యమని.. రాబోయే రోజుల్లో వాలంటీర్లే కాబోయే నాయకులని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని వాలంటీర్లకు జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బొండా ఉమా స్పందిస్తూ... వాలంటీర్లు ప్రజా సేవకులంటూ జగన్ ఇంత వరకు చెప్పిన వ్యాఖ్యలన్నీ అబద్ధాలని తేలిపోయిందని చెప్పారు. జగన్ నిజ స్వరూపం నిన్నటితో బయటపడిందని అన్నారు. 

వాలంటీర్లు వైసీపీ కోసం పని చేస్తున్న వ్యక్తులని జగన్ చెప్పారని అన్నారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని చెప్పారు. వాలంటీర్లు వైసీపీ సైన్యమైనప్పుడు... ఏ చట్టం ప్రకారం గత ఐదేళ్లుగా వాలంటీర్లకు రూ. 9,663 కోట్లు దోచి పెట్టారని ప్రశ్నించారు. వాలంటీర్లు భవిష్యత్తు వైసీపీ నేతలని సాక్షి పత్రికలో కథనం వచ్చిందని... ఈ కథనంతో వాలంటీర్ల బతుకులు రోడ్డున పడినట్టేనని చెప్పారు. 

ఏ రాజ్యాంగం ప్రకారం వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి, వారిని ప్రజల్లోకి పంపి వైసీపీ కోసం జగన్ పని చేయించుకున్నారని ఉమా ప్రశ్నించారు. వాలంటీర్లు వైసీపీ నాయకులైనప్పుడు... రాబోయే టీడీపీ ప్రభుత్వం వారిని ఎందుకు రెగ్యులరైజ్ చేసి, వారి వేతనాలు పెంచాలని అన్నారు. జగన్ వ్యాఖ్యలు, సాక్షి కథనంపై ఈసీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు దోచి పెట్టిన రూ. 9,663 కోట్ల సొమ్మును జగన్ నుంచే రాబట్టాలని అన్నారు.

More Telugu News