UK: బ్రిటన్‌పై భారతీయ విద్యార్థుల్లో విముఖత.. తగ్గిన వీసా దరఖాస్తులు

4 percent Drop In Indian Applications To UK Universities After New Student Visa Rules
  • యూసీఏఎస్ తాజా గణాంకాల్లో వెల్లడి
  • అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 4 శాతం తగ్గిన భారతీయుల దరఖాస్తులు
  • గ్రాడ్యుయేట్ వీసా పథకంపై సమీక్ష, ఇతర వీసా ఆంక్షలతో భారతీయుల్లో అనాసక్తి
అంతర్జాతీయ విద్యార్థి వీసాలపై బ్రిటన్ ఆంక్షల నేపథ్యంలో అక్కడి చదువులపై భారతీయుల్లో ఆసక్తి తగ్గుతోంది. యూకేలోని యూనివర్సిటీస్ అండ్ కాలేజస్ అడ్మిషన్స్ సర్వీసెస్ విభాగం (యూసీఎఎస్) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెలుగు చూసింది. గతేడాదితో పోలిస్తే ఈమారు బ్రిటన్‌లో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో భారతీయ స్టూడెంట్ల దరఖాస్తుల సంఖ్య 4 శాతం తగ్గి 8,770కు పరిమితమైంది. నైజీరియా విద్యార్థుల దరఖాస్తులు ఏకంగా 46 శాతం మేర తగ్గి 1,590కు చేరుకున్నాయి. బ్రిటన్‌లో ఈ ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా పెరిగినా భారతీయుల దరఖాస్తులు మాత్రం తగ్గడం గమనార్హం. 

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో విదేశీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య ఈ మారు 0.7 శాతం పెరిగింది. చైనా విద్యార్థుల దరఖాస్తులు అత్యధికంగా గతేడాది కంటే 3 శాతం పెరిగి 910కు చేరాయి. తుర్కియే, కెనడా విద్యార్థుల దరఖాస్తులూ పెరిగాయి. 

అయితే, గ్రాడ్యుయేట్ వీసాల జారీని సమీక్షిస్తామని రిషి సునాక్ ప్రభుత్వం ప్రకటించడమే భారతీయ విద్యార్థుల విముఖతకు కారణమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ వీసా పథకంలో విదేశీ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మరో రెండేళ్ల పాటు బ్రిటన్‌లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. 

ఇక బ్రిటన్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థులకు తమ కుటుంబాలను వెంట తెచ్చుకునే అవకాశం లేకపోవడం మరో కారణమని తెలుస్తోంది. గత నెలలోనే ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. అయితే, వీరందరూ వచ్చేసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని యూసీఎఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా. జో శాక్స్టన్ తెలిపారు.
UK
Indians
Foreign Education

More Telugu News