Sharad Pawar: శరద్ పవార్‌కు షాక్... అజిత్ పవార్‌దే అసలైన ఎన్సీపీ అన్న స్పీకర్

  • అజిత్ పవార్ వెంట మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నందున వారిపై అనర్హత వేటు వేయలేమన్న స్పీకర్
  • 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో అజిత్ వర్గానికి 41 మంది, శరద్ పవార్ వర్గానికి 12 మంది మద్దతు ఉందన్న సభాపతి
  • శివసేన ఆర్డర్‌ను కాపీ పేస్ట్ చేశారన్న సుప్రియా సూలే
Ajit Pawar faction real NCP rules Maharashtra Speaker

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరిదనే విషయంలో శరద్ పవార్‌కు షాక్ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీయే నిజమైన పార్టీ అని మహారాష్ట్ర శాసన సభాపతి రాహుల్ నార్వేకర్ తెలిపారు. ఎన్సీపీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారు. కాబట్టి ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని స్పష్టం చేశారు. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా అజిత్ పవార్ వర్గానికి 41 మంది మద్దతు, శరద్ పవార్ వర్గానికి 12 మంది మద్దతు ఉందని... మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నందున వేటు వేయలేమని స్పీకర్ స్పష్టం చేశారు.

కాపీ పేస్ట్: సుప్రియా సూలే

అజిత్ పవార్ వర్గమే అసలైన ఎన్సీపీ అని స్పీకర్ చెప్పడంపై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. గతంలో శివసేన విషయంలో ఇచ్చిన ఆదేశాలను కాపీ పేస్ట్ చేసి ఇప్పుడు చెప్పారని ఎద్దేవా చేశారు. స్పీకర్ నిర్ణయం దారుణమన్నారు. స్పీకర్ నార్వేకర్ నుంచి మనం ఇంతకంటే ఏం ఆశిస్తాము? అని విమర్శించారు. గతంలో ఏక్‌నాథ్ షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేనల విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించారో ఇప్పుడూ అలాగే చేశారన్నారు. వారు అసలైన శివసేన, ఎన్సీపీని తుద ముట్టించాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు దేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని ఆరోపించారు.

More Telugu News